తెలంగాణ బిడ్డలకు లక్ష ఉద్యోగాలు

C

ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్‌ కోటాపై కేంద్రానికి అఖిలపక్షం

తమిళనాడు తరహాలో మనమూ సాధించుకుందాం

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం

మార్చికల్లా తొమ్మిది గంటల విద్యుత్‌

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగపై జరిగిన ధన్యవాద చర్చకు సమాధానం ఇచ్చారు. అనంతరం సభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈసందర్భగా సిఎం మాట్లాడుతూ అన్ని అంశాలనూ కూలంకశంగా సమాధానం ఇచ్చారు. పెన్షన్లు మొదలుకుని, ఫీజు రియంబర్స్‌మెంట్‌, విద్యుత్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలు ప్రాణహిత చేవెళ్ల తదితర అన్ని అంశాలపై సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకచోట ఉండాలన్న లక్ష్యంతో అద్భుత సచివాలయం నిర్మించబోతున్నామన్నారు. తెలంగాన కళాభారతి కూడా నిర్మించబోతున్నామన్నారు. అన్నిటికీ మించి వచ్చే మార్చి నాటికి విద్యుత్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ఉదయం పూటే రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో తెలంగాణలో లక్ష ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తామన్నారు. ఇక పెనష్‌న్ల గురించి మాట్లాడుతూ లోగడ రూ.200 పెన్షను ఇస్తే తమ ప్రభుత్వం రూ.1000 ఇస్తుందని తెలిపారు. పెన్షన్ల కోసం ధర్నాలు జరుగుతున్నాయని సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారని అవి నిజమైన ధర్నాలు కాదని రాజకీయ ధర్నాలని తెలిపారు. పెన్షన్లపై పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దండగమారి ధర్నాలు మాని అర్హులైన లబ్దిదారులతో దరఖాస్తు పెట్టించండని కోరారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. కుటుంబ సర్వేలో కొన్ని కుటుంబాలు నమోదు కాని మాట వాస్తవమేనని వాళ్లతో మళ్లీ దరఖాస్తులు చేయిస్తే అధికారులు పరిశీలించి లబ్దిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని  కేసీఆర్‌ అన్నారు. మిషన్‌ కాకతీయ, తాగునీటి గ్రిడ్‌, వ్యవసాయం వంటి వాటికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు.

కొన్ని పత్రికలు భూముల అమ్మకాలపై తప్పుడు వార్తలు రాశాయని, సర్కారు అంచనాలకు తగ్గట్టు భూముల అమ్మకాలపై ఆదాయం రాలేదని రాశాయని ఆయన ఆరోపించారు. ఉచితంగా భూములిస్తే ఇళ్లు కట్టుకుంటామని 3.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక దరఖాస్తులు పరిశీలించి ఉచితంగా భూములు క్రమబద్ధీకరిస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూముల క్రమబద్ధీకరణ ద్వారా  వెయ్యికోట్ల ఆదాయం వస్తుందన్నారు. వచ్చేఏడాది మార్చి తర్వాత రాష్ట్రంలో కరెంట్‌ కోతలుండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరెంట్‌ విషయమై సీఎం మాట్లాడుతూ రైతులకు వచ్చే ఏడాది మార్చి నెల తర్వాత ఎలాంటి కష్టాలు పడనీయమని తెలిపారు. ఇకపై రైతన్నలు రాత్రిపూట పొలం కాడికి పోయి మృత్యువాత పడే పరిస్థితి రాదన్నారు. ఇందుకోసం రైతులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్‌ నందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం కష్టాలు పడకూడదని రూ. 1500 కోట్లతో విద్యుత్‌ కొని రైతులకు ఇచ్చి పంటలు కాపాడుకున్నామన్నారు. ప్రస్తుత సీజన్‌లో ఎకరం పంటకూడా ఎండనివ్వకుండా చూస్తామన్నారు. వచ్చే మార్చి తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఉండవని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇకపై రాత్రిపూట కరెంట్‌ అందించడమనే మాటే ఉండదని ఉద్ఘాటించారు. విద్యుత్‌ విషయంలో మనం విజ్ఞప్తి చేసినా, కేంద్రం ఆదేశించినా ఎపి సిఎం చంద్రబాబు కరెంట్‌ ఇవ్వలేదని దీనివల్ల మనకు మేలు జరిగిందన్నారు. ఇకముందు ఇస్తామన్నా తీసుకోబోమన్నారు. విద్యుత్‌ తీసుకుంటే అధిక ధర వెచ్చించాల్సి వచ్చేదని, మనం ఇస్తే తక్కువ ధరకు ఇవ్వాల్సి ఉండేదన్నారు. ఇప్పుడు ఆ బాధ లేకుండా బాబు చేశాడన్నారు.

ప్రమాణాలు లేని ఇంజనీరింగ్‌ కాలేజీలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ వల్ల తొలుత కొంత మనకు నష్టం ఉందని గ్రహించి కొంత కఠినంగా ఉన్నామని అన్నారు. ఇక అలాంటి పరిస్తితి లేకుండా చెల్లింపులు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ఇక కెజి టూ పిజి విద్యపై ప్రభుత్వం వెనక్కి పోదన్నారు. దీనిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరవాతనే ముందుకు పోతామన్నారు. పక్కాగా ప్రణాళికాబద్దంగా దీనిని అమలు చేస్తామన్నారు. ఇప్పుడున్న టీచర్లలో చాలామందికి ఆంగ్లభాషా నైపుణ్యం లేదని  అన్నారు.  కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అమల్లో చాలా ఇబ్బందులున్నాయని, తొందరపడి ఉచితవిద్య పథకాన్ని అభాసుపాలు చేయదలచుకోలేదని చెప్పారు. పథకాన్ని పకడ్బందీగా, కచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అయితే అందుకు కొన్ని ఆటంకాలున్నాయని తెలిపారు. కమల్‌నాథన్‌ కమిటీ ఉద్యోగుల విభజన పక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. కమిటీ తన పక్రియను పూర్తి చేయగానే ఉద్యోగాల భర్తీ మొదలవుతుందని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ హావిూకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే ఈ విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో కూడా ఆంధ్రా ఉద్యోగులు ఉన్నారని వారి విభజన కూడా పూర్తయితే ఆంధ్రా వాళ్లు వాళ్ల ప్రాంతానికి వెళ్లి పోతారని తెలిపారు. అప్పుడు తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఆంధ్రా విద్యార్థులకు కూడా రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే ఏమవుతుందని కొందరు అంటున్నారని అది సరికాదని సీఎం తెలిపారు. ఇవాళ ఫీజు ఇస్తే రేపు ఉద్యోగాలకు క్యూ కడతారని దీంతో తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాల్లో అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. మన రాష్ట్రం మనకు వస్తే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని తాను ముందే చెప్పానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్నది కాదని 14వ ఆర్థికసంఘం చెప్పిన విషయమని తెలిపారు. తెలంగాణ, గుజరాత్‌ రెండు రాష్టాల్రు ఆర్థిక మిగులు రాష్టాల్రని ఆర్థికసంఘం వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. మన తలసరి ఆదాయం జాతీయ ఆదాయం కంటే ఎక్కువగా ఉందని వివరించారు. అందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను అభినందించారు.

కంద్రం నుంచి మనకు వచ్చే ఆదాయం కొంత పెరిగిందని వెల్లడించారు. గతంలో ప్రణాళికా సంఘం పూర్తిగా కేంద్రం అజమాయిషీలో ఉండేదని కానీ నేటి నీతి ఆయోగ్‌లో మనం కూడా భాగస్వాములమని, మన వాయిస్‌ను వినిపిస్తామని అన్నారు. నీతి ఆయోగ్‌లో రాష్టాల్ర ముఖ్యమంత్రులు సభ్యులని తెలిపారు.  ప్రతిపక్షాలు పదేపదే హావిూలు అమలు చేయడంలేదని, తొమ్మిది నెలలైందని, పది నెలలైందని గోల చేయడం సరికాదన్నారు. తమకు ఇంకా కావాల్సినంత సమయం ఐదేళ్లు ఉందని తెలిపారు. రాత్రికి రాత్రి మారి పోవడానికి అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం లేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి కచ్చితంగా ఇచ్చి తీరుతామన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూములు పంచాయి కానీ అవి శాస్త్రీయంగా జరగలేదని వివరించారు. పది గుంటలు, ఇరవై గుంటలు ఇచ్చి చేతులు దులపుకున్నారని అన్నారు. నెల రోజుల్లో 104,108వాహనాలు వెయ్యి రాబోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.  మెరుగైన వైద్యసదుపాయాల కల్పించే అంశంపై మాట్లాడుతూ ఉస్మానియా,నీలోఫర్‌ ఆస్పత్రులను మెరుగుపరుస్తమని పునరుద్ఘాటించారు. క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్యసదుపాయాన్ని కల్పించేందుకు జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు తీసుకురావాలని సంకల్పించినట్టు తెలిపారు.