తెలంగాణ యాస భాషకు పట్టంకట్టాలె

1

ఎగతాలికి గురైన భాషనే ఎలుగెత్తి చాటాలె

తెలంగాణ నుడికారం ప్రామాణికం కావాలె

పాఠ్యపుస్తకాలు మన యాసలనే ఉండాలె

వక్రీకరించిన నిజాం చరిత్ర సహా…

అన్ని విషయాలు సిలబస్‌ల పొందుపరచాలె

()తాము మాట్లాడిందే భాషని, అదే అచ్చమైన తెలుగని పాఠ్య పుస్తకాల్లోకెక్కించిన్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేని పొట్టి శ్రీరాములుకు నాటి రాష్ట్ర అవతరణనాడు దండాలు పెట్టించిన్రు. సంక్రాంతియే పండగని తెలంగాణ బతుకమ్మ ఊసే ఎత్తలేదు. నిజాం 300 యేళ్ల పాలనలో జరిగిన సంక్షేమాన్ని, చారిత్రక కట్టడాలను చెప్పలేదు. నిజాం గద్దెదిగే చివరి రోజుల్లో యేడాదికాలంపాటు సాగిన రజాకార్లనే చరిత్రగా చూపెట్టే ప్రయత్నంచేసిన్రు. మన భాష,యాసను ఎక్కిరిస్తూ వారి సినిమాల్లో విలన్లకు వాడిన్రు. తియ్యటి తెలంగాణ ఉర్దూమిళిత నుడికారాన్ని అపహాస్యం చేసిన్రు. తెలంగాణ పునర్నిర్మాణంలో హేతుబద్ధమైన మన గంగా జమునా తహజీబ్‌ ప్రపంచానికి చాటాలె. ఆంధ్రులు మట్టికప్పిన మన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలె. మన చిన్నారులు జైతెలంగాణనే చదవాలె.

హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి):

సీమాంధ్ర వలస పాలనల అన్ని రంగాలల్ల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తిరిగి తన పూర్వవైభవం పుణికిపుచ్చుకోవాలె. ప్రధానంగా తెలంగాణ భాష, యాసపై జరిగిన సాంస్కృతికదాడిని శరవేగంగా రూపుమాపాలె. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఎన్నో కారణాలున్నయి. వాటిలో ఇక్కడి భాష యాసపై జరిగిన దాడి కూడ ప్రధాన కారణంగ చెప్పుకోవాలె. భాష అంటే మేం మాట్లాడేదే అని, తెలంగాణ వాసులకు భాష మాట్లాడటం కూడా రాదని ఎద్దేవా చేసిన కొన్ని ఆంధ్ర భాషా వారధులు, గడిచిన వలస పాలనలో, వలసాధిపత్యంలో ఇక్కడి ప్రజలపై వాళ్ల యాసను, సంస్కృతిని తీవ్రంగా రుద్దే ప్రయత్నం చేసిన్రు. పండగంటే సంక్రాంతేననేలా బతుకమ్మను కనుమరుగుజేయ జూసిన్రు. తెలంగాణలో తెలుగును అవపోసన పట్టిన ఎందరో మహానుభావులు పుట్టినా…ఇక్కడోళ్లకు ప్రాధాన్యం ఇయ్యకుండ, ఆంధ్రల పుట్టిన చిన్నాచితకా రచయితలను కూడ మహోన్నతులుగా చూపిన చరిత్ర ఆంధ్ర పత్రికలది, మీడియాది. తెలంగాణ యాసనెపుడు యీసడించు భాషీయుల ‘సహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గు చేటు అని  మహాకవి కాళోజీ అన్నట్టు ఆంధ్రవాసులు సగం భాష ఆంగ్లమే వాడుకుంట కూడ, తెలంగాణ ఉర్దూ వినిపించంగనే అంతలో కొంపమునిగినట్టు చేస్తరు. రెండున్నర జిల్లాల భాషను యావన్మంది మాట్లాడే తెలుగని ప్రచారం చేసిన్రు. ఇంకా చేస్తున్నరు. వలసాంధ్ర భాషాధిపత్యం ఏ స్థాయిలో ఉందంటే తెెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, ఈ ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా నడుపుతున్న యాదగిరి ఛానెల్‌ల ఇంక గూడ ఆంధ్ర యాసనే కంపుకొడుతున్నది. ఇంతటి లోతులకు చొచ్చుకచ్చిన ఆంధ్ర యాసను కూకటివేర్లతోని పెకిలించివేయాలె. తెలంగాణ ప్రాంత వాడుకభాషలో ఎన్నో పదకోశాలు, సామెతలు, నుడికారాలు ఉన్నాయి. తెలంగాణ భాషను కాపాడుకునేటందుకు తెలంగాణ రచయితల వేదికలాంటి సంస్థలు బృహత్‌కార్యచరణ రూపొందించాలె. తెలంగాణ భాషకు సంబంధించిన నిఘంటువు రూపొందించడంలో ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలె. తెలంగాణ విద్యార్థుల కోసం రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ యాసలోనే సిలబస్‌ రూపొందించాలె. అంతేకాక ప్రసారమాధ్యమాల్లో తెలంగాణ బాషను ప్రచురించేలా, ప్రసారం చేసేలా చొరవ తీసుకోవాలె. తెలంగాణ యాసను ఇన్నాళ్లూ కించపరిచిన తెలుగు సినిమాల్లో ఇకపైన తెలంగాణ భాషను జోకర్‌ పాత్రలకు, విలన్‌ పాత్రలకే పరిమితం చేయకుండ హీరోహీరోయిన్ల స్థాయి వరకు అన్ని పాత్రలకు విస్తరింపజేయాలె. ఎవరన్నా మన యాసను కింఛపరిచినా, ప్రశ్నించినా మా యాస గిట్లనే ఉంటదిబై అని సమాధానం జెప్పాలె. ఇన్ని రోజులనుంచి సమైక్య పాలనలో, వలసాధిపత్యంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై, భాష యాసపైన జరిగిన కుట్రలను తిప్పికొట్టాలె. తెలంగాణ గత చరిత్ర వైభవాన్ని జర్నలిస్టులు కూడ ఎప్పటికప్పుడు ఇక్కడి యాసల్నే కథనాలు రాస్తూ మన భాషయాసను కాపాడేటందుకు అనుక్షణం ప్రయత్నం చేయాలె. వక్రీకరించిన తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాలల్లకెక్కించి భావి తరాలకు మన భాష యాసకున్న ప్రత్యేకతను అందించాలె. ఆంగ్ల మాథ్యమం ఆధిపత్యం చేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడి భాషను కూడా కాపాడుకోవాల్సిన అవసరం అంతే ఉంది. ప్రత్యేకంగా ఒక భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణ భాషకున్న ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దీనికి భావితరాలకు మన భాష యాసను అందించడం ద్వారా మార్గం సుగమమవుతుంది కాబట్టి ఆదిశగా తెలంగాణ సకసజన సమాజం నడుం బిగించాలె.