తెలంగాణ యువతను మోసం చేసిన కెసిఆర్‌

ఉద్యోగాల కల్పనలో అరచేతిలో వైకుంఠం

50లక్షల ఉద్యోగాల హావిూ ఏమయ్యింది

కెసిఆర్‌ గత ప్రసంగాల రికార్డును ప్రదర్శించిన ఉత్తమ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడితో ఇంటికో ఉద్యోగం చొప్పున లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సిఎం కెసిఆర్‌ ఉద్యోగావకాశాల కల్పనలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో ఆయన మాజీ ఎంపి మధుయాష్కీ తదితరులతో కసలి విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన వంటి విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీంతో తెలంగాణ యువత పూర్తి నైరాశ్యంలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. టీఎస్‌పీఎస్సీ వద్ద 19 లక్షల మంది ఉద్యోగాల కోసం రిజిస్టేష్రన్‌ చేయించుకున్నారని, దీనిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉత్తమ్‌ అన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ద్వారా రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి.. 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని అన్నారు. 2014, 2015 శాసనసభ వేదికగా ప్రసంగాల్లో గవర్నర్‌ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారని చెప్పారు. మరి ఆ పెట్టుబడి, ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, గవర్నర్‌ గత ప్రసంగాలను సైతం విూడియాకు ప్రదర్శించారు. 2014 జూన్‌ 2 అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వచ్చినప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయనిఉత్తమ్‌ అన్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవాచేశారు. ఉద్యోగ నియామక సంస్థ టీఎస్‌పీఎస్సీలో సైతం ఖాళీలు ఉన్నాయన్నారు. ఉస్మానియాలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ప్రతిసారీ కొత్త కొత్త లెక్కలు చెబుతోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. భాజపాకు తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని ఉత్తమ్‌ ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 19 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం రిజిస్టేష్రన్‌ చేసుకున్నారంటే తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. మురళీ ముదిరాజ్‌ అనే బీసీ విద్యార్థి ఉద్యోగ అవకాశాలు రాక, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఇక ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపించక, నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని ఉత్తమ్‌ అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం కళ్లుతెరిచి స్పందించలేదని, పైగా చనిపోయిన విద్యార్థికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినవారిపై కేసులు పెట్టి జైలుకు పంపిందని ఉత్తమ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే ఉద్యోగావకాశాలతో కూడుకున్న కాజీపేట్‌ రైల్వే గూడ్స్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రైబల్‌ వర్శిటీ విషయాల్లో ఒక్క అడుగు కూడా ప్రభుత్వం ముందుకు వేయలేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ఎంపీ మధుయాష్కి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ది పగటి దొంగల ప్రజా నివేదిక సభ అని వ్యాఖ్యానించారు. మోదీకి సలాం చేస్తోంది.. గులాం గిరి చేస్తోంది కేసీఆరే అని అన్నారు. జోన్ల విషయంలో మోదీని నిలదీసిన కేసీఆర్‌.. మైనార్టీల రిజర్వేషన్‌ ఇస్తావా.. చస్తావా.. అని మోదీని ఎందుకు నిలదీయలేని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి అసులువులుబాసిన ఎంతమంది అమరుల కుటుంబాలకు సాయం చేశావో చర్చకు వస్తావా? అంటూ కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. రాజకీయ అధికారం కావాలా? గులాబీ నేతలకు గులాంగిరీ చేస్తారా? అనేది బీసీలు తేల్చుకోవాలన్నారు. ఎన్నికలు ఎంత తొందరగా వస్తే అంత మంచిదని ప్రజలు కూడా భావిస్తున్నారని మధుయాష్కి పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారంతా ఓడిపోయారని గతాన్ని గుర్తుచేశారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్‌పైనా మధుయాష్కి ఫైర్‌ అయ్యారు. కేటీఆర్‌ అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.