తెలంగాణ యోధునికి ఏదీ గౌరవం?

cc

తొలిదశ తెలంగాణ ఉద్యమనేత లక్ష్మినారాయణకు అవమానం

తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్‌ అడ్రసయిన అమరవీరులస్థూపానికి పునాది వేసిన యోధుడు

మహరాజ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా, హైదరాబాద్‌ మేయర్‌గా సేవలందించిన లక్ష్మినారాయణ

లక్ష్మినారాయణ చనిపోతే ప్రాధాన్యం ఇవ్వని సీమాంధ్ర మీడియా

తెలంగాణ బిడ్డల పట్ల సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించిన దశాబ్దాల ఆధిపత్య ఫలితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర సాధన. తెలంగాణను అక్రమంగా కలుపుకుని, అధికారం చెలాయించినంత కాలం ఇక్కడి మట్బిబిడ్డలపై వివక్ష చూపిన పాలకులకు పలికిన వత్తాసు పలికిన సీమాంధ్ర మీడియా రాష్ట్రం విడిపోయినా ఆ అహంకార వైఖరి మాత్రం వదులుకోవటంలేదు. తెలంగాణ భూమి పుత్రులు సాధించిన విజయాలను, ఇక్కడి కళలను, కళాకారులనే కాక చివరకు మహామహులను సైతం దశాబ్దాలుగా విస్మరించిన సీమాంధ్ర మీడియాకు తెలంగాణ ఏర్పాటైనా కనువిప్పు కలగటంలేదు. సీమాంధ్ర అహంకారానికి, తెలంగాణ యోధుల పట్ల చూపుతున్న వివక్షకు మరో నిలువెత్తు నిదర్శనం ఇటీవలే అమరుడైన లక్ష్మినారాయణ ముదిరాజ్‌కు వాళ్లిచ్చిన ప్రాధాన్యత. తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్‌ అడ్రసైన అమరవీరుల స్థూప నిర్మాణానికి పునాదులు వేసిన ఆ యోధున్ని సీమాంధ్ర మీడియా విస్మరించిన తీరు శోచనీయం. ఇలాంటి ఘటనల వల్లనే తెలంగాణ సమాజం యావత్తు సీమాంధ్ర మీడియాను ఈసడించుకుంటున్నది. గిదేనా తెెలుగు వాళ్లంతా ఒక్కటేనని తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంలో ఊదరగొట్టిన సీమాంధ్ర మీడియా తెలుగుదనం అని ప్రశ్నిస్తున్నరు. ఈ గడ్డకు సంబంధంలేనోళ్ల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పైన ఉండొద్దన్నందుకు గగ్గోలు పెట్టిన సీమాంధ్ర మీడియా ఇక్కడి మహానుభావులకు తగిన గౌరవం ఇవ్వకపోవటాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని గుర్తుంచుకోవాలె.

హైదరాబాద్‌, మార్చి 8(జనంసాక్షి) : స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌, మాజీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ ముదిరాజ్‌ అంటే తొలిదశ తెలంగాణ ఉద్యమకాలంలో తెలియని వారుండరు. ఆయన ఉద్యమ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శప్రాయం. ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న కాలంలోనే తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరిగింది. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ బిడ్డల ఆవేదన అర్థం చేసుకున్న ఆయన ఉద్యమ పంథాలో బావుటా ఎగరేశారు. నేను సైతం అంటూ ఆంధ్రుల కుట్రల ఫలితంగా తెరకెక్కిన అక్రమ నిర్బంధాన్ని సైతం ఖాతరు చేయకుండా 1969లో హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేసినప్పుడు గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి శంఖుస్థాపన చేశారు. అప్పట్లో నిషేధం ఉన్నా ధిక్కరించి శంకుస్థాపన చేసిన తెలంగాణ యోధుడు లక్ష్మినారాయణ. నిషేధాన్ని ధిక్కరించినందుకు జైలుకెళ్లాల్సివస్తుందని తెలిసినా తెలంగాణ గడ్డ విముక్తి కోసం జైలుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. అనుకున్నట్లుగనే తెలంగాణ అమరవీరుల కోసం స్థూపం నిర్మాణానికి పునాది రాయివేసి ఆయన జైలుకెళ్లారు. ఆయన వేసిన పునాదిరాయి నేటి తెలంగాణ రాష్ట్ర అవతరణకు దిక్సూచిగా నిలవటానికి ఎంతగానో దోహదం చేసింది.

తెలంగాణపై ఆంధ్రా దొరల పెత్తనం. 69లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం, హైదరాబాద్‌ రక్తసిక్తం, బుల్లెట్లకు ఎదురొడ్డి నినదించిన విద్యార్థి లోకం, ప్రభుత్వ లెక్కలు నాలుగు వందలే. నాలాల్లో, చెత్తకుప్పల్లో, మూసినదిలో పడవేయటమే కాక రహాస్యంగా నిర్వహించిన అంత్యక్రియల్లో ఒరిగిన వీరులెందరో. గుర్తుతెలియని శవాలపేర మాయమైన యువకిశోరాలు మరెందరో. ఇడ్లీ సాంబార్‌ గోబ్యాక్‌ మొదలు అనేక ఉద్యమాలకు హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజ్‌, నిజాం కాలేజ్‌, బ్యాచిలర్‌ క్వార్టర్స్‌ సజీవ సాక్ష్యాలు. తెలంగాణకు సంబంధంలేని ఆంధ్రోళ్ల విగ్రహాలు అడుగడుగునా తెలంగాణ అమరవీరుల యాది ఉండకూడదని సీమాంధ్రుల కుట్ర. ఆ కుట్రను చేధించి పట్టినపట్టు వదలక తెలంగాణ కోసం చిందిన రక్తపు మరకల గుర్తు గాయపడ్డ బుల్లెట్ల చిహ్నం. మన తెలంగాణ గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం. దాని రూపకర్తకు వందనం. వీరుడా వందనం. అమరుడా వందనం. తెలంగాణ  యోధుడా వందనం. తెలంగాణ ఉద్యమంలో నేలకొరిగిన అమరుల త్యాగాలను తరతరాలకు గుర్తుండేలా అమరవీరుల స్థూపాన్ని గుర్తుగా పెట్టినందుకు జైలుకెళ్లినా మొక్కవోని దీక్షతో అలుపెరగకుండా పోరాడిన సమర యోధుడా వందనం. నీ లాంటి అమరులు మా మధ్య నుండి భౌతికంగా దూరమవుతున్నా మీ స్ఫూర్తి మాకు ఆదర్శం. మీ ఆశయాలు మాకు ఆయువుపట్టు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరులైన వీరుల గుర్తుగా నేడు అందరూ స్మరించుకుంటున్న అమరవీరుల స్థూపాన్ని నిర్మించినందుకు మరోసారి మీకు జోహార్లు. జోహార్‌ అమరవీరుడు లక్ష్మినారాయణ ముదిరాజ్‌కు. జోహార్‌ జోహార్‌.

1969లో తర్వాత ఉద్యమం సద్దుమణిగిన సంధి కాలంలో లక్ష్మినారాయణ కాంగ్రెస్‌ పార్టీ తరపున మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. పలు సంవత్సరాలపాటు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సభ్యులుగా పనిచేశారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఆయన చూపిన తెగువ నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. అసెంబ్లీ ముందు ఉదయించిన అమరవీరుల స్థూపం ఉస్మానియా గడ్డమీద అమరుడైన సిరిపురం యాదయ్య మృతదేహాన్ని అక్కున చేర్చుకుంటుందని, నింగికెగసిన తెలంగాణ తారలు తమతో ఐక్యం చేసుకుంటారని స్థూపం వద్దకు తీసుకొచ్చేందుకు విద్యార్థి లోకం చేపట్టిన ఉద్యమానికి ఆదర్శం తెలంగాణ అమరవీరుల స్థూపం. ఇలాంటి ఎందరో అమరుల గుర్తుగా ఓ చిహ్నం ఉండాలని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని అసెంబ్లీ ఎదుట నిర్మించేందుకు అలుపెరుగని కృషి చేసిన తెలంగాణ సమరయోధుడు లక్ష్మినారాయణ ముదిరాజ్‌కు జనంసాక్షి జోహార్‌. నీ లాంటి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు అందరం చేయిచేయి కలిపి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తామని, నిలవాలని ఆశిస్తున్నం. మీరు భౌతికంగా మా మధ్య లేకున్నా మీ పోరాటపటిమ మాకు స్ఫూర్తి. మీ బాటలో నడవటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంటుంది. అణచివేతను ఎదుర్కొని, అలుపెరుగని పోరాటంతో, అకుంఠిత దీక్షాపరుల సారథ్యంలో సాధించిన తెలంగాణ మీ ఆశయాల సాధన దిశగా అడుగులేస్తున్నదని, మున్ముందు కూడా వేయాలని కోరుకుంటూ, ఇప్పటికైనా తెలంగాణ సమాజంపై సీమాంధ్ర మీడియా చిన్నచూపు మానుకుంటుందని ఆశిస్తూ జోహార్‌ లక్ష్మినారాయణ ముదిరాజ్‌,