తెలంగాణ విజయ దివస్
బానిస సంకెళ్లు బద్దలు
కేంద్రప్రభుత్వ పక్షాన చిదంబరం అధికారిక ప్రకటన
డిసెంబర్9పై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…
సీమాంధ్ర ఆధిపత్యంపై ఊరూవాడా ఒక్కటైంది.. ఒకటే నాథం.. ఒకటే వాదం.. ఒకటే నినాదం.. అదే జైతెలంగాణ. ఓ వైపు చలో అసెంబ్లీ పిలుపు.. మరోవైపు తెలంగాణ పల్లెలు పోరు ఖిల్లాలై.. సింహకంఠ నాథంతో నినదిస్తున్న సమయం. పాలకుల కాళ్లకింద భూమి కదిలింది. ఢిల్లీ పీఠంలో కదలిక. 60 ఏళ్ల తండ్లాట.. ఓ ప్రకటన. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరో స్వతంత్య్ర సంగ్రామంలా సాగిన తెలంగాణ విజయ దివస్ డిసెంబర్ 9.
హైదరాబాద్, డిసెంబర్ 8 (జనంసాక్షి) : ఈ రోజు తెలంగాణ చరిత్రలో కీలకమైన శుభదినం. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం కేంద్రం మెడలు వంచిన రోజు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన చేసిన రోజు. తెలంగాణ బిడ్డల బానిస సంకెళ్లు బద్దలైన రోజు. అదే.. డిసెంబర్ 9, 2009. ఈ రోజును తెలంగాణ విజయ దివస్‌గా భావించి తెలంగాణవాదులు సంబురాలు చేసుకున్న రోజు. ఈ రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి విజయ సంకేతంగా నిలిచిన రోజు. ఈ విజయానికి నేటికి ఐదేళ్లు. ఈ రోజును స్మరించుకుంటూ ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.
పెల్లుబికిన తెలంగాణ ఉద్యమం…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో సాగుతోంది. యావత్ తెలంగాణ ప్రజానీకమంతా స్వరాష్ట్రం కోసం ఆంధ్రా పాలనపై సింహాలై గర్జిస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ నలుదిక్కులా వ్యాపించింది. ఈ తరుణంలోనే.. కెసిఆర్ నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు దీక్షా స్థలి అయిన సిద్ధిపేటకు బయలుదేరారు. ఈ దీక్షను భగ్నం చేసేందుకు కీచక సీమాంధ్ర ప్రభుత్వం కెసిఆర్‌ను మార్గమద్యలోనే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది. దీంతో తెలంగాణ ఉద్యమం మరింత పెల్లుబికింది. కెరటమై ఎగిసిపడింది. తెలంగాణ బిడ్డల నినాదాలు ఢిల్లీ కోటను తాకాయి. కేంద్ర ప్రభుత్వంలో కదలికలు తెచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానాన్ని కంపింపజేశాయి.
దిగొచ్చిన కేంద్రప్రభుత్వం…
తెలంగాణ బిడ్డల ఉద్యమ ధాటికి.. పోరాట పటిమకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపిఎ ప్రభుత్వం దిగొచ్చింది. కెసిఆర్ దీక్షకు తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకోక తప్పలేదు. డిసెంబర్ 9, 2009న కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశమై అధికారికంగా అప్పటి హోం మంత్రి పి.చిదంబరం చేత కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయించింది. దీంతో కెసిఆర్ దీక్ష విరమించారు. తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. కానీ.. ఈ సంతోషం ఎంతో కాలం నిలవకుండా పోయింది. దీనికి కూడా సీమాంధ్రులే కారణమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనను తిప్పికొట్టేందుకు ఆంధ్రాలో సమైక్యాంధ్ర అనే బూటకపు ఉద్యమాన్ని లేవదీశారు.
తెలంగాణ బిడ్డల బానిస సంకెళ్లు బద్దలు…
తెలంగాణ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అధికార ప్రకటన చేయడంతో సమైక్య పాలనలో తెలంగాణ బిడ్డల బానిస సంకెళ్లు బద్దలయ్యాయి. సమైక్య పాలన పాపాల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు మార్గం ఏర్పడింది. ఆంధ్రాపాలకుల అణిచివేతను అంతం చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి డిసెంబర్ 9, 2009 రోజు, అప్పటి ఉద్యమం తొలి విజయంగా చరిత్రలో లిఖించబడింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు డిసెంబర్ 9 తొలిమెట్టుగా మిగిలిపోయింది. అప్పుడే సీమాంధ్రుల ఆగడాలకు కళ్లెం వేసినట్లైంది.