తెలంగాణ విమోచనను విస్మరించారు: బిజెపి
ఆదిలాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి ) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడం ద్వారా సిఎం కెసిఆర్ తెలంగాణపై తన చిత్తశుద్దిని చాటుకోవాలని బిజెపి జిల్లా నాయకుడు పాయల శంకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఎంతగా ప్రాధాన్యం ఉందో విమోచనకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని గుర్తించాలని అన్నారు. కేవలం ప్రగతి నివేదన సభతోనే సంతృప్తి పడకుండా దీనిని కూడా చేపట్టాలన్నారు. నిజానికి 17ననే ఈ సభ పెట్టి ఉంటే తెలంగాణ చిత్తవుద్ది చాటేందుకు అవకాశం వచ్చేదన్నారు. ఎంఐఎం లేదా మరెవరికోసమో చరిత్రను కాలరాయడం సరికాదన్నారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో విమోచనోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఇందులో ప్రజలంతా పాల్గొని తెలంగాణ విమోచన పోరాటాలను తెలుసుకోవాలన్నారు.