తెలంగాణ సాధనకు ఈ నెలే కీలకం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇందుకోసం నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజ సాగించని పోరాటాలు లేవు. చేయని ఉద్యమాలు లేవు. నడపని ఆందోళనలూ లేవు. అంతకుమించి ఎన్నో విలువైన ప్రాణాలు సైతం ఇందుకోసం తృణ ప్రాయంగా అర్పించారు. రాజకీయ ప్రక్రియే పరిష్కారం చూపుతుందంటే జై తెలంగాణ అంటూ ఎన్నికల్లో పోటీకి దిగిన వారెందరినో చట్టసభలకూ పంపారు. ఇన్ని పోరాటాలు, మరెన్నో ఉద్యమాల ప్రభావంతో ‘తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అనే ప్రకటన చేయించగలిగాం. కానీ ఇన్ని దశాబ్దాల పోరాట ఫలితం సిద్ధించకముందే ఆత్మగౌరవం, స్వపరిపాలన దక్కకముందే ఏ నోటితోనైతే రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారో అదే నోటితో రాష్ట్ర పరిస్థితులు చక్కబడే వరకూ.. అంటూ సాగదీశారు. ఈ మధ్యకాలంలో జరిగిన దుష్ట రాజకీయాలు మనెవ్వరికీ తెలియనివి కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామంటూ ప్రకటన చేయగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. పార్టీలకతీతంగా స్పీకర్ ఎదుట క్యూ కట్టి రాజీనామా లేఖలు సమర్పించారు. హైదరాబాద్ ఎక్కడ చేజారుతుందోనని కొందరు పెట్టుబడీదారులు డబ్బు సంచులు గుమ్మరించి ఒక్కో చోట పది, పదిహేను మందిని కూడగట్టి సమైక్యాంధ్ర అనే కల్పిత ఉద్యమానికి తెరలేపారు. రాష్ట్రంలో విస్తరించి ఉన్న సీమాంధ్ర మీడియా దీనిని భూతద్దంలో చూపింది. చిలువలు పలువలు చేసి పదే పదే ప్రసారం చేసింది. ఏదో జరిగిపోతోంది అనే భయాందోళనలోకి సీమాంధ్ర ప్రజలను నెట్టివేసింది. బేరసారాలు, మేనేజ్‌మెంట్ వ్యవహారాలు తెలిసిన అన్నీ పార్టీల కార్పొరేట్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలోని కొందరు అధిష్టానం పెద్దలను ఎలాగోలా మేనేజ్ చేశారు. పెట్టుబడీదారి ఉద్యమాన్ని, నాలుగు దశాబ్దాలుగా ప్రజలు స్వచ్ఛదంగా సాగిస్తున్న పోరును ఒకే గాటన కట్టి ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్నారు. ఇది జరిగి మూడేళ్లు గడిచింది. 2009 నవంబర్ 9న అర్ధరాత్రి కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయగా 12 రోజుల తర్వాత అదే నెల 23న మలి ప్రకటన చేశారు. ఈ వ్యవధిలోనే సీమాంధ్ర ప్రాంత నేతలు పార్టీల అడ్డుగోడలు దాటి ఒకే వేదికపై కౌగిలింతలతో చూసే వారికే వెగటు పుట్టించేలా ప్రవర్తించారు. దాన్ని సీమాంధ్ర మీడియా ఆహో ఓహో అంటూ చూపింది. వేసిందే వేసి.. చెప్పిందే చెప్పి విసుగు పుట్టించింది. ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు వివిధ రాజకీయ పార్టీల నేతలు గుర్తించాల్సింది ఒక్కటే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నప్పుడు అడ్డుకోని పార్టీలు తెలంగాణ సాధించుకోవడానికి ఎందుకు అడ్డంకిగా మారుతున్నాయి? ఇంతకాలం సీమాంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగి బతికిన ఇక్కడి సోకాల్డ్ ఇంకా ఎంతకాలం అలాగే వ్యవహరిస్తారు? వారి ప్రయోజనాల రక్షణే లక్ష్యంగా ఎన్నేళ్లు పనిచేస్తారు? చీమూనెత్తురు ఉన్నవారంతా స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే నేతలంతా ఆయా పార్టీల్లోని పెత్తందారులకు కొమ్ముకాస్తున్నారంటే వారిని ఏమనుకోవాలి. వారి లక్ష్యం ఏమిటనుకోవాలి. ప్రజల ఆకాంక్షపై ఓట్లప్పుడు కాస్త మాట్లాడితే చాలూ అని ఎవరైనా అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఇంతకు మించిన మంచి తరుణం మరెప్పటికో కాని రాదు. టీ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడితో దిగివచ్చిన యూపీఏ సర్కారు చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశానికి పార్లమెంట్ ఆమోదం కోసం తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేసింది. రాజకీయ ఐకాస, ప్రజానీకం అన్నిపార్టీలపై సాధ్యమైనంత మేరకు ఒత్తిడి తెచ్చి ఒకే అభిప్రాయమో, తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తున్నామనే అభిప్రాయాన్నో చెప్పించారు. అఖిలపక్షం అనంతరం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షమని పనిలో పనిగా ప్రకటించారు. నెల రోజుల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందిలే అని ఎక్కడి వారు అక్కడ విశ్రాంతి తీసుకుంటే మళ్లీ సీమాంధ్ర పెట్టుబడీదారులు రెచ్చిపోయే ప్రమాదముంది. తెలంగాణ ఆకాంక్ష లేదని, కొందరు రాజకీయ నిరుద్యోగులు మాత్రమే కోరుకుంటున్నారనే విష ప్రచారంతో మళ్లీ మేనేజ్‌మెంట్ రాజకీయాలకు తెరతీయవచ్చు. డబ్బు సంచులతోనో, ప్రజల మనోభావాలో రెచ్చగొట్టి తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవడానికి ఉన్న అన్ని దారులనూ ఉపయోగించుకుంటారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రజలు ఈ నెల రోజులు పోరుబాటనే నడవాలి. వచ్చిన అవకాశాన్ని వదులకోకుండా ఉద్యమ స్ఫూర్తిని చాటాలి. నాలుగు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు మూకుమ్మడిగా పోరు సలపాలి.