జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తాచాటాలి
` కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
` పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి
` ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి
` పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి
` ప్రజలకు ప్రభుత్వంపై భరోసా కల్పించాలి
` నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్‌ఛార్జిలతో ముఖ్యమంత్రి సమావేశం
హైదరాబాద్(జనంసాక్షి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్‌ఛార్జిలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఉప ఎన్నిక గెలుపు కోసం క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సీఎం సూచించారు.పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ‘‘నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపైనే ఉంది. మీ పనితీరుతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నా. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’’ సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.