తెలంగాణ సైనికులకు శిక్షణ శిబిరాలు

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌ :
తెలంగాణ సైనికులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రాపార్టీల అంతం, తెలంగాణ పంతం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. బుధవారం నుంచి టీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, మోసాలను కార్యకర్తలకు ఈ శిక్షణ శిబిరాల్లో వివరిస్తామని తెలిపారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలను భూస్థాపితం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాబోవు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతామన్నారు. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారకరామారావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే రాజయ్య, రమణాచారి, బాల్క సుమన్‌, ప్రకాశ్‌, ఎర్రోల్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.