తొంగి చూసిన తొలకరి

1

పులకరించిన హైదరాబాద్‌

హైదరాబాద్‌,జూన్‌12(ఆర్‌ఎన్‌ఎ): తొలకరి పులకరించింది. రుతుపవనాల ఆగమనాన్ని రుజువు చేస్తూ హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం కురిసింది.  హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సచివాలయం, నాంపల్లి, లక్డీకపూల్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అదే విధంగా సికింద్రాబాద్‌, వారాసిగూడ, మెట్టుగూడ, ఉప్పల్‌ పార్సీగుట్ట, అడ్డగుట్ట, రామాంతపూర్‌ తదితర ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాంనగర్‌, వీఎస్టీ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, బాగ్‌ లింగంపల్లి, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇక నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెంలో డిండి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. భారీ వర్షం పడడంతో సీఎం సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌ కూలిపోయింది. ఓ మహిళా కానిస్టేబుల్‌ కు గాయలయ్యాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీనితో పలు గ్రామాలకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రహదారులపై పొంగి పొర్లుతోంది. దీంతో వాహన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పని నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.