త్వరలోనే రెండోవిడత ప్రక్షాళన

కొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): మొదటి విడత పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయిన తర్వాతనే రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన పక్రియను చేపడతామని  ఆర్డీవో రవీంద్రనాథ్‌ అన్నారు.  జూలై 15 తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతోందని అన్నారు. పాస్‌పుస్తకాల పరిశీలన పూర్తి బాధ్యత తహసీల్దారులపై ఉందన్నారు. వీటితో 10 శాతం ఆర్డీవో, 5 శాతం జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించాల్సి ఉందని అన్నారు. అంతేకాకుండా పాస్‌పుస్తకాలు, పంట చెక్కుల పంపిణీపై జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అదర్‌ సిన్హాను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించిందని తెలిపారు. ప్రత్యేకాధికారి కూడా భూ రికార్డుల ప్రక్షాళన పక్రియను పర్యవేక్షిస్తారని వివరించారు. కొత్తగూడెం డివిజన్‌లో మొదటి విడతలో కొత్త పాస్‌పుస్తకాలతో పాటు రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ 20 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. డివిజన్‌లో మొత్తం 58,712 కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 48,755 పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయ్యిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 9,957 పుస్తకాల పంపిణీని నిలిపివేసినట్లు చెప్పారు. వీటిని కూడా గ్రామసభల ద్వారా తప్పొప్పులు సవరించి రైతులకు అందజేస్తామని అన్నారు. రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం నాటికి 300 మంది సర్వేయర్లు రానున్నారని, ఇప్పటికే భర్తీ పక్రియ పూర్తయినట్లు తెలిపారు.