త్వరలో ఎస్‌స్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులను భర్తీ చేస్తాం : సీఎం

ఒంగోలు, అక్టోబర్‌ 11 : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఈ నెల 9న ప్రారంభించిన ఇందిరమ్మ బాట గురువారం నాడు ముగింపు దశకు చేరుకుంది.  సంతనూతలపాడులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల రైతులకు మేలు చేకూర్చేందుకే ఇందిర జలప్రభను అమలు చేస్తున్నామని, వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో నాలుగువేల ఎస్సీ, ఎస్టీల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఇళ్లపట్టాల మంజూరులో కొన్ని ఇబ్బందులున్నాయని,వాటిని అధిగమించి త్వరలోనే అందజేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కవిద్యార్థిపై ఏడాదికి 35వేల రూపాయల చొప్పున ఎదో ఒక రూపంలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని పై స్థాయికి చేర్చేందుకే అనేక సంక్షేమ పథకాలను చేపట్టి అమలు చేస్తున్నామన్నారు.  వీపీ నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు భూములను అందజేస్తూ వాటి అభివృద్ధికి కూడా నిధులు సమకూరుస్తున్నామన్నారు. 2006 నుంచి 2007 వరకు కొన్ని ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయని, వాటిపై నివేదిక తెప్పించుకుంటున్నామని అవి అందాక ఆ ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామన్నారు. ఈ ఏడాది లక్షా 25వేల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తున్నామన్నారు.