త్వరలో మంత్రివర్గ విస్తరణ

కళంకితుల తొలగింపు
అందరినీ కలుపుకుపొమ్మని మేడం హితవు
సీఎం ఢిల్లీ టూర్‌ సక్సెస్‌
పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ల పదవుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
న్యూఢిల్లీ, మే 17 (జనంసాక్షి) :
రాష్ట్రంలో మంత్రవర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ కళంకిత మంత్రులకు ఉద్వాసన పలికేందుకు అధిష్టానం ఓకే చెప్పింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతి రాజకీయాలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం చీవాట్లు పెట్టింది. అందరినీ కలుపుకుపోవాలని సోనియాగాంధీ ముఖ్యమంత్రికి హితవు పలికింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కిరణ్‌.. శుక్రవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. కళంకిత మంత్రుల వ్యవహారం, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్‌ పదవులు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక తదిర అంశాలపై చర్చించారు. అలాగే, తనపై అసమ్మతివర్గం చేస్తున్న ఆరోపణలపైనా అధినేత్రి వివరణ ఇచ్చుకున్నారు. కళంకిత మంత్రులకు గట్టి మద్దతుగా నిలబడ్డారు. అయితే, పెరిగిపోతున్న అసమ్మతిపై  ఆగ్రహం వ్యక్తం చేసిన అధినేత్రి.. అందరినీ కలుపుకోవాలని ఆదేశించారు. కళంకిత మంత్రులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై మార్గనిర్దేశనం చేశారు. సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో మేడమ్‌ కిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రాభవం కోల్పోతున్న పార్టీ, పెరిగిపోతున్న అసమ్మతి కార్యకలాపాలపై నిలదీసినట్లు సమాచారం. కళంకిత మంత్రుల విషయంలోనూ అక్షింతుల వేసినట్లు తెలిసింది. చార్జిషీట్‌లో పేర్లు నమోదైనా ఇంకా వారిని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, కళంకిత మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గట్టి మద్దతు పలికినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాల కథనం మేరకు.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీలో, క్యాబినెట్‌లో చర్చించకుండానే పథకాలు చేస్తున్నారని తనపై వస్తున్న ఆరోపణలపైనా వివరణ ఇచ్చుకున్నారు. కొంత మంది కావాలనే పార్టీని దెబ్బ తీసేందుకు అసమ్మతి కార్యకలాపాలు పెంచిపోషిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకే కొత్త పథకాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వాటన్నంటికీ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేర్ల విూదనే అమలు చేస్తున్నామని.. ఆయా పథకాల తీరును వివరించారు. కానీ, కొంత మంది పని గట్టుకొని ప్రభుత్వాన్ని, పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. పార్టీ ముఖ్యులు, క్యాబినెట్‌లోని వారే పథకాలను విమర్శిస్తూ ప్రతిపక్షాలకు అవకాశం కల్పిస్తున్నారని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, సి.రామచంద్రయ్యలపై సోనియాకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఇమేజ్‌ను దెబ్బ తీసే వారిని ఉపేక్షించ వద్దని కోరారు. పీసీసీ కార్యవర్గంతో పాటు పలు కార్పొరేషన్ల పదవుల భర్తీకి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.