దమ్ముంటే మహానాడులో తెలంగాణ తీర్మానం చేయి

బాబుకు కేసీఆర్‌ సవాల్‌
అవసరం లేదని చెంచాగాడు ‘ఎర్రబెల్లి’ చెప్పుడేంది?
మనది ధర్మయుద్ధం
తెలంగాణ విజయం సాధిస్తుంది : కేసీఆర్‌
నిజామాబాద్‌/బాన్సువాడ, మే 24 (జనంసాక్షి) :
దమ్ముంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సవాల్‌ విసిరారు. తెలంగాణపై మహానాడులో తీర్మానం అవసరం లేదని నీ చెంచాగాడు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో చెప్పించుడు ఏందంటూ మండిపడ్డారు. నాడు కురుక్షేత్రంలో వీరపోరాటాలు సాగినా కూడా చివరకి పాండవులే గెలిచారని, రామాయణంలో కూడా రాముడే గెలిచాడని గుర్తుంచుకోవాలని కేసిఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో కూడా ధర్మమే గెలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని అన్నారు. ధర్మం తెలంగాణ పక్షాన ఉందని గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడంతోపాటు ఆంధ్రాపార్టీలు మనకు అవసరమా అంటూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకుగాను నియోజకవర్గాలవారీగా  పది వేలమందికి ప్రత్యేక శిక్షణనిచ్చే కార్యక్రమ నిర్వహనలో బాగంగా నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో ఏర్పాటు శిక్షణ శిబిరంలో కేసిఆర్‌ మాట్లాడారు. ప్రతి మహిళ రాణిరుద్రమదేవిలా విజృంభించాలన్నారు. సమ్మక్క సారలమ్మల పోరాటస్ఫూర్తిగా మహిళలు ముందుకు రావాలన్నారు. తెలంగాణ ఓట్లకోసం గుంటనక్కలా బాబు కాచుకు కూర్చున్నాడని ఆరోపించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహానాడులో తెలంగాణ కోసం తీర్మానం చేయాలని సవాల్‌ విసిరారు. చలో అసెంబ్లీ కార్యక్రమంతో తాడోపేడో తేల్చుకుందామన్నారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న బాబు సకల సనుల సమ్మె నాడు ఏమయ్యాడని  ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పరిపాలనా సౌలభ్యం కోసం 24 జిల్లాలుగా విభజిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనైనా సాధించి తీరుతామని  పేర్కొన్నారు. 1956కు ముందున్న తెలంగాణా రాష్టాన్న్రే కావాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తామేం కొత్తరాష్టాన్న్రి కావాలని కోరడం లేదన్నారు. ఎంతకాలమైన టీడీపీ, వైసీపీలలో తెలంగాణకు చెందినవ్యక్తి పార్టీ అధ్యక్షుడుగాని, సీఎంగాని కాలేడన్నారు. తెలంగాణ విముక్తికోసం టిఆర్‌ఎస్‌లో చేరితే రాజకీయ వ్యభిచారం ఎలా అవుతుందన్నారు. తెలంగాణ రాకుంటే మనల్ని సీమాంధ్రులు బొందపెడతారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేరుకే జాతీయపార్టీకాని సీమాంధ్రుల పెత్తనంలోనే ఉందన్నారు. ఇచ్చేదిమేమే తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌ రాకుంటే చచ్చేది కూడా మేమేనని శాపం రాసిపెట్టుకుందన్నారు. తెలంగాణలో రైతులకు పగటి పూట 8గంటల విద్యుత్‌ అందిస్తామన్నారు. పదివేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి చూపిస్తామన్నారు. 18 నెలల్లో పూర్తి చేస్తా మన్న దేవాదుల ప్రాజెక్టు 40 ఏళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజలు కోరు కుంటున్నారన్నారు. ఈతరం బిడ్డలుగా తెలంగాణ తెచ్చుడు ఖాయమన్నారు. తెలంగాణా కోసం అందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 20కోట్ల మైనస్‌ బడ్జెట్‌లో ఆంధ్రా ఉండేదని, నెహ్రూను లొంగదీసుకుని తెలంగాణను కలుపుకున్నారన్నారు. ఢిల్లీని శాసించి తెలంగాణ తెచ్చుకోవాల్సినవసరం ఉందన్నారు. అందుకోసం కనీసం 15 ఎంపీ సీట్లు, వంద అసెంబ్లీ సీట్లు సాధించాల్సి ఉందన్నారు. వచ్చిన  తెలంగాణను జగన్‌, చంద్రబాబు రాత్రికిరాత్రి ఏకమై అడ్డుకున్నారని ఆరోపించారు. ఈవిషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కరుడు గట్టిన సైనికుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఆంధ్రాపార్టీలు అవసరమా అనే చర్చ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఏఐఎస్‌ అధికారి రమణాచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు.