దళితులంటే అలుసెందుకు?
ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం
కరీంనగర్, జనంసాక్షి: పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, దళితులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, దళితులంటే ఇంత అలుసా అని జిల్లాకు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, జిల్లా అధికారుల సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మంచిర్యాల చౌరస్తాలో జరిగిన జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవంలో పాల్గొన్న పలువురు మండిపడ్డారు. ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ గజ్జెల కాంతం మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలో జరిగే జయంతి వేడుకలకు ప్రజా ప్రతినిధులు కాకపోవడంపై విరుచుకుపడ్డారు. అధికారిక కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలనే నిబంధన ఉన్నా జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడం దళిత జాతిని అవమానపరచడమేనని అన్నారు. ఎల్లంపల్లి, మధ్యమానేరు ముంపు గ్రామాల భూనిర్వాసితుల్లో చాలా మంది ఎస్సీలేనని, వారికి నష్టపరిహారం చెల్లింపులో అధికారులు జాప్యం చేయడం తగదని అన్నారు. సబ్‌ప్లాన్‌ను కిందిస్థాయి వరకు అమలు చేసి ప్రభుత్వం తమ చిత్త శుద్ధిని చాటుకోవాలని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగె రాజారాం మాట్లాడుతూ… సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వాలు దారిమళ్లించిన కోట్లాది నిధుల సంగతేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి మాట్లాడుతూ… చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో లీడ్‌క్యాప్ కోసం కేటాయించిన భూములను పోలీస్ బెటాలియన్‌కు కట్టబెట్టే ఆలోచనను మానుకొని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్‌వర్మ మాట్లాడుతూ… దళితుల పట్ల అధికారులు వివక్ష వీడాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపినా పనులు చేయడం లేదని మండిపడ్డారు. దళితులను ఉద్ధరిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న అంబేద్కర్‌స్టడీ సర్కిల్‌ను ఎందుకు మూసివేశారని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ బీమాసాహెబ్ ధ్వజమెత్తారు. దళిత నాయకులు జన్ను జయరాజ్, మేడి మహేష్, మ్యాదరి శ్రీనివాస్, జె.స్వామి మాట్లాడుతూ… గతంలో వేదికల సాక్షిగా జయంతి వేడుకల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ ప్రాంగణానికి అంబేద్కర్ పేరు. ప్రభుత్వాసుపత్రికి జగ్జీవన్‌రామ్ పేరు పెట్టాలని, అంబేద్కర్ స్టడీ సెంటర్‌ను తెరిపించాలని, వివాదాస్పదంగా ఉన్న అంబేద్కర్ భవన భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. మహిళా జేఏసీ అధ్యక్షురాలు సుంకె యశోద మాట్లాడుతూ.. జయంతి వేడుకల్లో తప్పదళితుల గురించి మాట్లాడిన నాయకులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా జేఏసీ, అంబేద్కర్ సంఘం నేతలు మాట్లాడుతూ.. కాగితల్లో అంకెల గారడి అభివృద్ధిని చూపిస్తూ దళితులను దగా చేస్తున్నారని, చట్టాలు అమలు కావడం లేదని, భూవివాదాలు పెండింగ్‌లో ఉంటున్నాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పోలీసులు నిందితుల పక్షాన నిలిచి దళితులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, బండారి శేఖర్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీకి రూ. 50కోట్లు కేటాయించాలని, మెడికల్, నర్సింగ్ కళాశాలలను ప్రారంభించాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. పెగడపల్లి మండలం ల్యాగలమరిల్రో సర్వేనంబర్ 59,63లో గల ప్రభుత్వ భూమిని భూస్వాముల నుంచి తీసుకొని పేదలకు పంచాలని గ్రామానికి చెందిన మహిళలు సభలో నినాదాలు చేస్తూ మంత్రికి మొరపెట్టుకున్నారు. నేతల డుమ్మా… ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు దళిత ప్రజాప్రతినిధులైన ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు దేవయ్య , ఈశ్వర్ సైతం హాజరుకాకపోవడం గమనార్హం.