దళిత రైతులకు ఆధునిక శిక్షణ

6లోగా దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని దళిత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం పులిరాజు తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులు ఆర్థిక ప్రోత్సాహం కల్పిస్తూ దళిత రైతులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఇందుకోసం ఆసక్తి ఉన్న రైతులు జూన్‌ 6వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేవీకే, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, మత్స్యశాఖల సంయుక్త సహకారంతో ఈ శిక్షణ చేపడుతున్నారు.   జిల్లా భౌగోళిక పరిస్థితులకు అనువుగా సరికొత్త పథకాలు అధునాతన సాంకేతిక పద్ధతులు, యాంత్రీకరణను అవగాహన చేసుకొని వ్యవసాయ రంగంలో దళిత రైతులు అభివృద్ధి సాధించేందుకు చేయూతనిస్తామన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సంబంధిత తహసీల్దార్‌ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆదాయ, కుల, ఆధార్‌ ధ్రువీకరణ పత్రాలతో జిల్లా షెడ్యూల్‌ కులాల సేవా అధికార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అందజేయాలన్నారు.