దాడులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మహబూబాబాద్, నవంబర్ 11(జనంసాక్షి):
దళితులపై జరుగుతున్న దాడులను నివారించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రావణ్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ దళిత విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగికదాడి చేసి గొంతునులిమి హత్యాయత్నం చేయడం అమానుషమన్నారు. దాడికి పాల్పడిన దుండగున్ని వెంటనే ప్రభుత్వం శిక్షించాలన్నారు. 2016 జూలై 11న గుజరాత్ రాష్ట్రంలోని ఉనా ప్రాంతంలో గోరక్షక దళంపేరుతో దళిత యువకులపై దాడి చేశారని, ఆ ఘటనకు బాధ్యులైన వారిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఆ ఘటన మరువక ముందే అదే దళం మరో ముగ్గురు దళితులపై దాడులకు పాల్పడినా మోడీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుందేతప్ప చర్యలకు పూనుకోలేదని ఆరోపించారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దళితులపై పరోక్షంగా దాడులకు పాల్పడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే దళితులపై దాడులకు పాల్పడిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.