‘దాసరి’ బొగ్గు బొక్కేశాడు

నవీన్‌ జిందాల్‌, దాసరిపై ఎఫ్‌ఐఆర్‌

రూ.2.25 కోట్ల పెట్టుబడి నజరానా

సీబీఐ సోదాలు

కీలక పత్రాలు స్వాధీనం

న్యూఢిల్లీ, జూన్‌11 (జనంసాక్షి) :

స్వతంత్ర భారతంలోనే అత్యంత పెద్దదైన బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. విచారణ నివేదిక పీఎంవో కార్యాలయానికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఇచ్చి సుప్రీంకోర్టుతో గట్టిగా చీవాట్లు తిన్న సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. బొగ్గు స్కాం విచారణలో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పలు చార్జిషీట్లు దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ తాజాగా మంగళవారం మరో చార్జిషీట్‌ దాఖలు చేసింది. కేంద్ర బొగ్గు గనుల మాజీ మంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ను నిందితులుగా పేర్కొంది. జిందాల్‌ స్టీల్స్‌ అండ్‌ పవర్‌, గగన్‌ స్పాంజ్‌తో పాటు మరికొన్ని కంపెనీల పేర్లను చార్జిషీట్‌లో చేర్చింది. దాసరి, నవీన్‌ జిందాల్‌ సహా ఆయా సంస్థలపై నేరపూరిత కుట్ర, మోసం తదితర అభియోగాలను నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిఫలంగా దాసరి కంపెనీ సిరి మీడియాలో జిందాల్‌ 2.25 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేసింది. ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా సహా 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో దాసరి నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో సీబీఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు సోదాలు నిర్వహించారు. పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. దాసరి, నవీన్‌తో పాటు ఐదు కంపెనీలపై ఐపీసీ 120బీ, రెడ్‌ విత్‌ 420 కింది కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(1)(డి) కింద కేసు నమోదు చేశారు.