దిల్లీలో ఆమ్‌ఆద్మీ ‘క్రేజ్‌’

C

సంప్రదాయ పార్టీలను ఊడ్చిపారేయనున్న ‘చీపురు’

హస్తిన సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌కే మొగ్గు

అన్ని సర్వేలూ ఆప్‌కే అనుకూలం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి): హస్తినలో ఆమ్‌ ఆద్మీ క్రేజీ పార్టీగా అవతరించనుందా. అవుననే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌. దిల్లీ గద్దెను మళ్లీ సామాన్యుడే అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపే సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ మొగ్గు చూపుతున్నాయి. సర్వేల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 35 నుంచి 40 సీట్లు సాధించి అతిపెద్దగా అవతరించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. దాదాపు అన్ని జాతీయ స్థాయి విూడియా సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల్లో ఇదే చెబుతున్నాయి. తాజా ఎన్నికల్లో ఆప్‌ 31-39 వరకూ సీట్లు గెలుచుకునే ఆస్కారం ఉందని టైమ్స్‌ నౌ తన సర్వేలో పేర్కొంది. బీజేపీ 27-35 సీట్లను గెలుచుకుని రెండో స్థానానికే పరిమితం అవుతుందని తెలపగా, కాంగ్రెస్‌ పార్టీ 2-4 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 36 స్థానాలు గెలుచుకోవాలి. గత ఎన్నికల్లో ఎవరికీ తగినంత మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్‌ మద్దతుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టింది. ఈసారి మాత్రం కచ్చితంగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని చాలావరకు ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. హస్తినలో అధికారంపై కోటి ఆశలు పెట్టుకున్న కమలనాథులు రెండో స్థానంతో ప్రధాన ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుందంటున్నాయి. మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టి, తర్వాత బొక్కబోర్లా పడిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి సింగిల్‌ డిజిట్‌ తోనే సరిపెట్టుకోక తప్పదని చెబుతున్నాయి. రాహుల్‌ గాంధీ ప్రచారం, సోనియాగాంధీ ప్రసంగాలు ఆ పార్టీకి ఏమాత్రం మేలు చేయలేదు. ఇక స్వయంగా ప్రధానమంత్రే రంగంలోకి దిగినా కూడా బీజేపీ రెండడుగుల దూరంలోనే మిగిలిపోతుందని సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ అంటున్నాయి. ఖచ్చితంగా చీపురు సంప్రదాయ పార్టీలను ఊడ్చిపారేయనుందని సర్వేలన్నీ చెప్తున్నాయి. అయితే.. ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు వస్తాయో, ఎవరు అధికారం చేపడతారో కచ్చితంగా తెలియాలంటే మాత్రం మంగళవారం వరకు ఆగాల్సిందే.

ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎవరెవరు ఎలా చెప్పారో చూద్దాం..

ఇండియా టుడే-సిసిరో సర్వే: ఆప్‌ 35-43; బీజేపీ 23-29; కాంగ్రెస్‌ 3-5

టైమ్స్‌ నౌ- సీఓటర్‌ సర్వే: ఆప్‌ 31-39; బీజేపీ 27-35; కాంగ్రెస్‌ 2-4

ఎన్డీటీవీ సర్వే: ఆప్‌ -38; బీజేపీ 28; కాంగ్రెస్‌ 4

ఏబీపీ నీల్సన్‌ సర్వే: ఆప్‌ 39; బీజేపీ 28; కాంగ్రెస్‌ 3

న్యూస్‌ నేషన్‌ సర్వే: ఆప్‌ 39-43; బీజేపీ 25-29; కాంగ్రెస్‌ 1-3