దొంగలు బాబోయ్ దొంగలు
ఖమ్మం, అక్టోబర్ 29 : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని జయనగర్ కాలనీలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేెలెతుత్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లి, తిరిగి వచ్చేసారికి ఇంట్లోని నగదు, ఆభరణాలు, సామాన్లు మాయమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వివాహాలకు కనీసం మూడు గంటలు, సినిమాకు మరో గంటలు పడుతుంది. వెళ్లి రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు నెలల కాలంలో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగుళ ఇళ్లల్లో చోరీలు జరిగాయి. జయనగర్ కాలనీ ప్రధాన రహదారి సమీపంలో ధనలక్ష్మి వైన్స్ షాపు ఉంది. ఇక్కడ మద్యం తీసుకొని జయనగర్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో మద్యం సేవిస్తున్నారు. సమీపంలోని తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చీకటి పడిందంటే మద్యం సేవించడంతో పాటు ఆసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో సైతం మద్యం తాగుతూ చుట్టుప్రక్కల ఇళ్లలోని పరిస్థితులను గమనించి, అదును చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆసాంఘిక కార్యక్రమాలకు, జల్సాలకు డబ్బులు కావాల్సి రావడంతో చోరీలకు తెగబడుతున్నారు. గతంలోనే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడంతో పరిస్థితి కొంతమేరకు మెరుగైంది. ఈ విషయంపై అర్బన్ సిఐలు వివరణ కోరగా, నిఘా మరింతగా పెంచుతామని ఆయన తెలిపారు.