నకిలీ విత్తనాల బెడద లేకుండా చర్యలు: కొండబాల

ఖమ్మం,మే23(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను రక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వరంగ విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ విత్తన అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు. నకిలీ విత్తనాలు ఎరువుల బెడద లేకుండా కఠిన చర్య తీసుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఎకరానికి రూ.8 వేలు, సబ్సిడీతో కూడిన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తోందన్నారు. విత్తనోత్పత్తి కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రతి జిల్లాకో కొత్త యూనిట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం జీడిమెట్లలో విత్తన పరీక్ష ల్యాబ్‌ ఉందని, మరొకటి ఖమ్మం కేంద్రంగా ఏర్పాటుకు, మిగితా జిల్లాల్లో కొత్త యూనిట్లకు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నామన్నారు. ఈ కేంద్రాలతో నకిలీ విత్తనాల బెడద తగ్గడంతోపాటు రైతులకు ఈ యూనిట్ల ద్వారా విత్తనాలు సరఫరా చేసి రైతులకు ప్రోత్సాహ బహుమతి అందజేస్తామన్నారు. రాష్ట్రంలో మంచి పంటలకు అనుకూలమైన నేల ఉందని, దానికి తగ్గట్టు ప్రభుత్వం రైతులకు లాభదాయకమైన విత్తనాలు అందించేందుకు కృషిచేస్తుందన్నారు. రైతులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు.
———————