నాకు సొంత ఎజెండా లేదు ప్రభుత్వ ఎజెండా అమలే నా లక్ష్యం

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మహంతి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ మహంతి మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా  వ్యవహరించిన మిన్నీ మాథ్యూ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సొంత ఎజెండాలేవీ లేవని, ప్రభుత్వ ఎజెండాను అమలు పరచడమే తన విధి అని చెప్పారు. రెవెన్యూ సదస్సుల మిగతా 2లోనిర్వహణ ద్వారా రాష్ట్రంపై అవగాహన వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు పరచడమే తన లక్ష్యమని మహంతి చెప్పారు. కలసికట్టుగా పనిచేద్దామని తన సహచర ఐఎయస్‌లకు చెప్పారు. తాను ఈ రాష్ట్రానికి చెందినవాడినేనని అన్నారు. నీతి నిజాయితీ, పారదర్శకతే తనకు కొలమానాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తానని ఆయన చెప్పారు. ఇందిరమ్మ కలలు, అమ్మహస్తం, మీసేవా వంటి పథకాలు ఎంతో మంచివని ఆయన అన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు అవకాశం రావడం తనకు దక్కిన గౌరవమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ మహంతి అన్నారు. 34 ఏళ్ళలో అఖిల భారత సర్వీసులో అధికారిగా తాను వివిధ హోదాలలో పనిచేసినప్పటికీ రాష్ట్రంలో పనిచేయడం ద్వారా ప్రజాసేవ చేసే అవకాశం అన్నింటికంటే ఎక్కువ తృప్తినిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను చిత్తశుద్ధితో పేద ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ పదవి నుంచి చీఫ్‌ సెక్రటరీ పదవి చేపడుతున్న మహంతికి రెవెనన్యూ ఉద్యోగ సంఘాలు వీడ్కోలు పలికాయి. ఇప్పటి వరకు ఆయన పనిచేసిన భూపరిపాలన శాఖలో ప్రధాన కమిషనర్‌గా ఐవైఆర్‌ కృష్ణారావును ప్రభుత్వం నియమించింది.
జీవిత విశేషాలు…
1979 బ్యాచ్‌కు చెందిన మహంతి ఆంధప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 1954 ఫిబ్రవరి 25న జన్మించిన ఆయన ఒరిస్సా రాష్ట్రానికి  చెందినవారు. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడైన మహంతి స్నాతకోత్తర పట్టాని కూడా ఇదే అంశంలో పొందారు. 1987లో అమెరికా బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు చేసి డాక్టరేట్‌ సాధించారు. ప్రస్తుతం ఆయన భూపరిపాలన ముఖ్య కమిషనర్‌గా జనవరి 31 నుంచి పనిచేస్తున్నారు. మహంతి 1981 నుంచి 1983 వరకు తెనాలి సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సామాజిక న్యాయం, సాంఘీక సంక్షేమశాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా కొద్ది కాలం పనిచేసిన తర్వాత 1983 నుంచి 85 వరకు గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా సేవలందించారు. 1985-87 మధ్య కాలంలో విశాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌గా, తర్వాత ఏడు నెలల పాటు గుంటూరు జిల్లా కలెక్టర్‌గానూ పనిచేశారు. 1991 మే నుంచి 1993 వరకు ఉడా వైస్‌ చైర్‌పర్మన్‌గా పని చేశారు. 1998 వరకు కేంద్ర సర్వీసుల్లో పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన మంత్రిత్తవ విభాగంలో సంచాలకుడిగా ఉన్నారు. అదే ఏడాది విదేశాల్లో పనిచేసే అవకాశం కింద ఆసియా అభివృద్ధి బ్యాంకులో సేవలందించారు. 1999లో తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చిన డాక్టర్‌ మహంతి హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేకాధికారిగా మూడేళ్లపాటు పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక స దుపాయాలు అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. తర్వాత ఎంసీహెచ్‌ ఆర్డీ జాయింట్‌ డైరెక్టర్‌గా, 2006 ఆగస్టు నెలాఖరు వరకు సుపరిపాలన కేంద్ర డైరెక్టర్‌ జనరల్‌గా సేవలందించారు. 2006 సెప్టెంబర్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్ళిన ఆయన ఈ ఏడాది జనవరి వరకు అక్కడే వివిధ హోదాల్లో పనిచేశారు. జెఎస్‌ఎన్‌యూఆర్‌ఎం మిషన్‌ డైరెక్టర్‌గా కేంద్ర సంయుక్త కార్యదర్శి, అదనపు కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో, సాధారణ పరిపాలన శాఖలోను, భూపరిపాలన ముఖ్య కమిషనర్‌గా రెవెన్యూశాఖలోనూ సేవలందించారు.