నాగర్జునసాగర్‌లో 15, 16న కేఆర్‌ఎంబీ ఉపసంఘం పర్యటన


హైదరాబాద్‌,నవంబరు 11(జనంసాక్షి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఈనెల 15, 16 తేదీల్లో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లో భాగంగా కేఆర్‌ఎంబీకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన ఔట్‌లెట్లను సబ్‌కమిటీ పరిశీలించనుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్‌లెట్లను పరిశీలించిన ఉప సంఘం.. తాజాగా నాగార్జున సాగర్‌కు సంబంధించిన ఔట్‌లెట్లను పరిశీలించనుంది. ఈమేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలోని సబ్‌ కమిటీ 15, 16 తేదీల్లో సాగర్‌లో పర్యటించనుంది. ఏఎంఆర్‌పీ ఎత్తిపోతల పంప్‌హౌస్‌, సాగర్‌ స్పిల్‌ వే, స్లూయీస్‌, ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్‌ ఉత్పత్తికేంద్రం, కుడి కాల్వ హెడ్‌ రెగ్యులేటర్లను ఉప సంఘం పరిశీలించనుంది. రెండో రోజైన 16వ తేదీ సాగర్‌ ఎడమ కాల్వ పవర్‌ హౌస్‌, ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌, వరద కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలిస్తారు. ఆరోజు మధ్యాహ్నం ఉప సంఘం సమావేశం నాగార్జున సాగర్‌లో జరగనుంది.