నాడు ఎన్టీఆర్‌..నేడు కెసిఆర్‌

మంత్రిగా సేవ చేసే భాగ్యం కల్పించారు
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
భద్రాద్రి కొత్తగూడెం,మే28( జ‌నం సాక్షి ): ఆనాడు ఎన్‌టిఆర్‌, నేడు కెసిఆర్‌ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  వీరిద్దరూ ప్రజలకోసం తపించిన వారేనని అన్నారు. కెసిఆర్‌ కారనంగానే ఇవాళ అనేక  అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాఉల చేపట్టామని అన్నారు. రైతుబంధు పథకంతో సిఎం కెసిఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.  సోమవారం భద్రాదిలో విూడియాతో మాట్లాడుతూ  ఇప్పటికే ఇతర రాష్టాల్లో కూడా రైతుబంధు అమలుచేయాలనే డిమాండ్‌ పెరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక సీతరామ ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని తుమ్మల స్పష్టం చేశారు. గ్రామాలు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, గ్రామ పంచాయతీల స్వరాజ్యమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పక్కాగా పని చేస్తుందని పేర్కొన్నారు. అందుకు గ్రామ సర్పంచి బాధ్యుడవుతారని వెల్లడించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం సజావుగా జరిగేలా పాలన ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతల కుటుంబాలకు ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దేశంలో మరెక్కడా అమలులో లేని వినూత్న, రైతు కుటుంబానికి ఆసరాగా నిలిచే బృహత్తర పథకానికి ముఖ్యమంత్రి రూపకల్పగా నిలిచారని కొనియాడారు. ఏదేని కారణంతో రైతు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించేలా జీవిత బీమా సంస్థతో ఒప్పందం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన వార్షిక ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రతీ రైతు పేర రూ.2,271లను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో 40 లక్షల మంది 18 నుంచి 60 ఏళ్లలోపు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి సూచించారు.
కొద్ది రోజుల్లో ముస్లింలకు రంజాన్‌ దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. అలాగే పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు వేగంగా, చురుగ్గా జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు.