నారాయణ బ్రాండ్ చెప్పి బురిడీ
అనుమతి లేకుండా అడ్మిషన్లు అడ్డగోలుగా డబ్బుల వసూళ్లు
– అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు
– ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వైనం
…………………………
మణుగూరు, జూన్ 27, (జనంసాక్షి) : నానాటికీ అభివృద్ధి చెందుతున్న మణుగూరులోని నారాయణ స్కూల్ బ్రాండ్ పేరుతో అనుమతి లేని అడ్మిషన్లు చేసి అమాయకులను బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. పార్టీల్లో తిరుగుతూ… ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సదరు ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ అడ్మిషన్ల పేరుతో జనాల నుంచి డబ్బులు వసూళ్లకు షాడోగా ఉండి పథకం వేసినట్లు తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యుల కృషితో ప్రస్తుతం మణుగూరులో డిగ్రీ కాలేజీ విజయవంతంగా సాగుతోంది. ఇక భవిష్యత్తులో తన డిగ్రీ కాలేజీ నడిచే అవకాశం లేకపోవడంతో ఇప్పుడున్న విద్యార్థులను అదే పేరున ఉన్న జూనియర్ కాలేజీకి తరలించాలనుకున్నట్లు తెలిసింది. ఈ మూడంతస్థుల డిగ్రీ కాలేజీని నారాయణ స్కూల్ బ్రాండ్ ని ఉపయోగించి ప్రైవేట్ స్కూల్ గా మార్చి లోకల్ గా ఉన్న ఇతర పాఠశాలలను దెబ్బతీసే ప్రయత్నమే నారాయణ బ్రాండ్ వినియోగంలా సమాచారం. సదరు స్కూల్ డైరెక్టర్ జూదరుడిగా పలుమార్లు పోలీసులకు చిక్కగా, పలు ప్రభుత్వ స్థలాల కబ్జా వ్యవహారంలోనూ ప్రధానపాత్ర పోషించినట్లు గతంలో పత్రికలు కోడై కూశాయి. దీంతో తన పేరుతో అడ్మిషన్లు జరిగే అవకాశం లేకపోవడంతో… ఇటీవల అధికార పార్టీలో తన పబ్బం గడుపుకునేందుకు చేరి, గతంలో ఓపెన్ డిగ్రీ విద్యార్థులను చేర్పించిన అనుభవం ఉన్న శేషగిరినగర్ కి చెందిన ఓ వ్యక్తితో పాటు అతని స్నేహితులను పీఆర్వోలుగా మార్చి అడ్మిషన్ల తతంగం ముందుకు నడిపించినట్లు తెలుస్తోంది. మండలంలోని అన్ని మారుమూల గ్రామాల్లోనూ విద్యార్థులను వడబోసి నానా హంగామా సృష్టించి ఇతర పాఠశాలలను దెబ్బతీసి ఇప్పుడు వారి పరిస్థితిని గాలికి వదిలేసినట్లు సమాచారం. మండల విద్యాశాఖాధికారి చర్యలు తీసుకోకుండా సదరు స్కూల్ డైరెక్టర్ ఇతర పాఠశాలల లొసుగులను బూచీగా చూపించడంతో విద్యాశాఖాధికారికి పలువురు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, నేను మణుగూరుతో పాటు కొన్ని మండలాలకు ఇన్ చార్జినంటూ సమాధానం దాటవేసి అక్కడి నుంచి వెళ్లిపోయేవారని తెలుస్తోంది.
260కు పైగా అడ్మిషన్లు : రూ. 10లక్షలకు పైగా వసూళ్లు….
ఏజెన్సీ ఏరియాలో సీబీఎస్ఈ సెంట్రల్ సిలబస్ బోధించేందుకు 500 స్క్వేర్ ఫీట్ల తరగతిగది (కనీసం విద్యార్థుల నిష్పత్తిని బట్టి ఒక మీటరుకు ఒక స్టూడెంట్), లైబ్రరీ, రీడింగ్ రూములు, తరగతులకు తగిన పుస్తకాలు, ఆట స్థలం, డార్మెటరీ రూములు, ఈ-బుక్స్, లైబ్రరీ నుంచి ప్రతీ రోజూ కోరిన విద్యార్థులకు కోరిన పుస్తకం ఇచ్చే విధంగా ఉండటంతో పాటు ఒక స్కూల్ కనీసం 20 కంప్యూటర్లతో కూడిన ఒక లైబ్రరీ, మ్యాథమెటిక్స్ లైబ్రరీ, విద్యార్థులకు ఆట పాటలకు ప్రత్యేక గదులు, డ్రింకింగ్ వాటర్, స్టూడెంట్స్ కి సరిపోయే విధంగా టాయిలెట్స్ ఉండి కేంద్రం వద్ద అనుమతి పొందాలని సుప్రీంకోర్టు 2004లో సివిల్ కేసు నెంబర్ 483 ప్రకారం అవినాష్ మెహర్‌తో వేసిన కోర్టులో తీర్పును ఇచ్చింది. కానీ అధికార పార్టీ నేత తనకున్న నెట్వర్క్ ను ఉపయోగించి పట్టణానికి నడిబొడ్డున ఉన్న కాలేజీకి నాన్ సౌండ్ పొల్యూటెడ్ ఏరియాగా అనుమతి పొందినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అనుమతే రాని పాఠశాలకు ఈ సర్టిఫికెట్ పొందడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఫైర్ అనుమతులకు కూడా నోచుకోని సౌండ్ పొల్యూటెడ్ ఏరియాలోని సుందరయ్యనగర్ లోని మూడంతస్థుల డిగ్రీ కళాశాలలో నారాయణ సీబీఎస్ఈ పేరు చెప్పి పవన్ అనే కొత్త వ్యక్తిని సృష్టించి హైదరాబాద్ నారాయణ అడ్మిషన్ ఫారం చూపి పది లక్షలకు పైగా డబ్బులు మింగిన్నట్లు తెలుస్తోంది. ఎండాకాలం సెలవుల్లో ఇతర పాఠశాలలకు చెందిన ఖాళీగా ఉన్న టీచర్లను పీఆర్వోలుగా మార్చి దాదాపు 260కి పైగా మణుగూరులోని మారుమూల గ్రామాల్లో అడ్మిషన్లు చేసి లోకల్లో పోటీగా మారిన ఇతర పాఠశాలలను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏకంగా ఒక్కో స్టూడెంట్ తల్లిదండ్రుల నుంచి 3500 వసూలు చేశారు. గతంలో నారాయణ స్కూల్ కు అనుమతి లేదని ఊహాగానాలు వెల్లువెత్తడంతో అడ్మిషన్లు పొందిన తల్లిదండ్రుల నుంచి పీఆర్వోలపై ఒత్తిడి పెరగడంతో తూ…తూ మంత్రంగా సంతకం, స్టాంపులేని రసీదులు ఇచ్చి మభ్యపెట్టారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. నేటికీ స్కూల్ తరగతులు ప్రారంభం కాకపోవడంతో పీఆర్వోలపై తల్లిదండ్రుల నుంచి తమ డబ్బు వెనక్కి ఇచ్చేయాలంటూ విపరీతమైన ఒత్తిడి చేస్తున్నా కొందరు అందుబాటులోకి రావడం లేదు. అధికార పార్టీలో ఉంటూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సదరు స్కూల్ డైరెక్టర్ తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అడ్మిషన్లు పొంది ఏం చేయాలో తోచక బిక్కచూపులు చూస్తున్న తల్లిదండ్రులకు వ్యవహారం మొత్తం తెలిసీ ఒక్కసారైనా అనుమతి లేని పాఠశాలలను నమ్మొద్దని పత్రిక స్టేట్మెంట్ ఇవ్వని మండల విద్యాశాఖాధికారి ఏం న్యాయం చేస్తారో వేచి చూడాలి.
|