నార్వేలో ‘ఆంధ్రా’ దంపతులకు జైలు శిక్ష

ఓస్లో, డిసెంబర్‌ 4 (జనంసాక్షి): చిన్నారిని మందలించిన కేసులో తెలుగు దంపతులు చంద్రశేఖర్‌, అనుపమలకు ఓస్లో న్యాయస్థానం మంగళవారంనాడు శిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్‌కు 18నెలలు, తల్లి అనుమపకు 15నెలలపాటు జైలు శిక్షను విధించింది. చంద్రశేఖర్‌ దంపతులు తమ ఏడేళ్ళ కుమారుడిని వేధించారని, వాతలు పెట్టారని, కొట్టారంటూ ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. ఇందుకు

తగ్గా ఆదారాలు పరిశీలించిన న్యాయస్థానం ఆ దంపతులకు జైలు శిక్షను ఖరారు చేస్తూ పై కోర్టుకు అపీల్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఏడేళ్ళ సాయిశ్రీరాంను తల్లిదండ్రులు బెల్టుతో కొట్టారని, 2007సంవత్సరం నుంచి  2012 మార్చి మధ్యకాలంలో పిల్లాడిని భౌతికంగా ఇబ్బందుల పాలు చేశారని, పిల్లాడి ఒంటిపై వాతలు తేలాయని, మచ్చలు కూడా ఉన్నాయని ఓస్లో పోలీసులు తెలిపారు. కాగా, చంద్రశేఖర్‌ దంపతులకు నార్వేలో జైలు శిక్ష పడడం పట్ల వారి బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నార్వే కోర్టు తీర్పుపై అక్కడి ఉన్నత న్యాయస్థానంలో అపీల్‌ చేస్తామని వారి బందువు శైలేంద్ర తెలిపారు. శిక్ష ఖరారైన వార్త టివిలలో చూసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సొంత బిడ్డలను మందలించుకునే అవకాశం లేని చట్టాలేమిటంటూ నార్వే నిబంధనలపై మండిపడుతున్నారు. క్రమశిక్షణ నేర్పడం కూడా పిల్లలకు తప్పా అని వారు ప్రశ్నిస్తున్నారు. నార్వే దేశ చట్టాలలో జోక్యం చేసుకోలేమంటూ భారత ప్రభుత్వం నిస్సాహయత వ్యక్తం చేసిందని వారు తెలిపారు. తల్లిదండ్రుల కోసం చంద్రశేఖర్‌ పిల్లలు తల్లడిల్లిపోతున్నారని చెప్పారు. పిల్లలు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని చెప్పారు. డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి ద్వారా పిల్లల చికిత్స వివరాలను నార్వే కోర్టుకు పంపుతామని తెలిపారు. తనను భారత్‌ పంపించేస్తానన్నారని, బట్టలలో మూత్రం చేసినందుకు దండించారని చంద్రశేఖర్‌ దంపతుల ఏడేళ్ళ కుమారుడు తన టీచర్‌కు చెప్పడం ఆమె దీనిపై అక్కడి బాలల హక్కుల పరిరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడం, వారు బాలుడి ఆరోపణలను నిర్దారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓస్లో పోలీసులు దర్యాప్తు చేసి గత నెల 23వ తేదీన బాలుడి తల్లిదండ్రులు చంద్రశేఖర్‌, అనుపమలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం నాడు వాదోపవాదాలు పూర్తయ్యాయి. పిల్లలకు క్రమశిక్షణ నేర్పేందుకే దండించాల్సి వచ్చింది తప్ప కన్న బిడ్డలను ఎవరూ తీవ్రంగా హింసించరన్న డిఫెన్స్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది.