నావికుల అప్పగింత కేసు దుమారం

ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రి
రాజీనామా
రోమ్‌, (జనంసాక్షి) :
నావికుల అప్పగింత కేసు ఇటలీలో దుమారం రేపింది. పార్లమెంట్‌లో ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చోటుచేసుకున్నాయి. స్వదేశానికి తిరిగివచ్చిన వారిని తీసుకెళ్లి మరీ భారత్‌లో విడిచిపెట్టి వచ్చారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. దీంతో కలత చెందిన ఇటలీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గిలియో టెర్జీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ విషయాన్ని ఇటలీ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఎస్‌ఏ వెల్లడించింది. 2012 ఫ్రిబ్రవరిలో ఇటలీకి చెందిన నావికులు కేరళాకు చెందిన జాలర్లను హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నావికులు మిస్సిమిలియనో లటోరే, సల్వటోర్‌ గిరోనేను విచారణ అధికారులు అరెస్టు చేశారు. వారు విచారణ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. కొంతకాలం క్రితం ఇటలీలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని వారు కోర్టుకు అర్జీ పెట్టుకోగా సమ్మతించింది. అయితే ఇటలీ ప్రభుత్వం వారిని భారత్‌కు తిరిగి అప్పగించబోమని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మధ్య వర్తిత్వం వహించిన భారత్‌లో ఇటలీ హై కమిషనర్‌పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నావికులు తిరిగి వచ్చే వరకూ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. గడువులోగా వారు భారత్‌కు తిరిగి రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటే హెచ్చరించింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న భారత ప్రభుత్వం ఇరు దేశాల మధ్య సుహృద్భావ పూరిత వాతావరణం కొనసాగలంటే నావికులను భారత్‌కు అప్పగించాలని కోరింది. వారికి మరణ శిక్షలాంటి కఠిమైన శిక్షలు విధించబోమని తేల్చిచెప్పింది. దీంతో వారిని ఇటలీ సర్కారు భారత్‌కు పంపింది. ఇందుకు విదేశాంగ శాఖ మంత్రి చేతగాని తనమే కారణమే ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకునే అవకాశం ఉన్నా నావికులను భారత్‌ ఇటలీకి ఎందుకు పంపిందో అర్థం కావడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటలీలో అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం సరికాదంటూనే అక్కడి ప్రతిపక్షాల తీరును తప్పుబట్టాయి.