నిజాం పాలన తెలంగాణ అభివృద్ధికి చిహ్నం
నిజాం వల్లే తెలంగాణకు మొదటి విద్యుత్ వెలుగులు
1872లోనే విద్యాసంస్థల ఏర్పాటు
నాలుగు భాషల్లో విద్యాబోధన, సెక్కులర్ పాలన
చైైనా యుద్ధ సమయంలో భారత్‌కు భారీ సాయం
రైల్వేస్, ఎయిర్‌పోర్టులు, ఆర్టీసిల పుట్టుక అప్పుడే..
తెలంగాణలో పారిశ్రామిక విప్లవం నిజాంతోనే..
హైదరాబాద్ స్టేట్‌ను ‘మినీ ఇండియా’గా పేర్కొన్న నెహ్రూ
తెలంగాణను కొల్లగొట్టేందుకే ఆంధ్రోళ్ల పాలన
ఉన్నవన్నీ ఊడ్చిపెట్టిన వలసపాలకులు
కాకతీయులు, శాతవాహన, నిజాం ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలి
నిజాం పాలనలో తెలంగాణ అభివృద్ధిపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
”హైదరాబాద్ హైకోర్టు నిర్మాణ సమయంలో నిజాం సర్కార్‌తో ఇంజనీర్ ఇలా అన్నాడు. నిర్మిత ఆవరణలో దేవాలయం ఉన్నది. దాన్ని తొలిగిస్తే తప్ప హైకోర్టు నిర్మాణం సాధ్యం కాదు. అందుకు నిజాం నీ అదాలత్ పునాదుల్లోనే న్యాయం లేకపోతే.. కోర్టులో న్యాయం ఎలా ఉంటుంది..? గుడిని అట్లనే ఉంచి హైకోర్టు నిర్మించమన్నాడు. ఇప్పటికీ కోర్టులో గుడి అలాగే ఉంది”
”ముస్లిం అలీఘడ్ యూనివర్శిటీ నిర్మాణ సమయంలో చందా కోసం వచ్చిన నిర్వాహకులు దేశంలోనే అత్యంత ధనవంతుడవైన ముస్లిం రాజువు. నీ వద్ద నుంచి ఎక్కువ చందా ఆశిస్తున్నామన్నారు. అప్పుడు నిజాం తన ఖజానా డబ్బులు హిందువులు పన్నుల రూపంలో చెల్లించినవి హిందూ బెనారస్ యూనివర్శిటీకి ఎంత చందా ఇచ్చామో.. తన మంత్రి పింగళి వెంకట్రాంరెడ్డిని కనుక్కొనగా పది లక్షల చందా ఇచ్చినట్లు రికార్డులో తేలింది. అందులో సగం ఐదు లక్షలు ముస్లిం అలీఘడ్ వర్శిటీకి చందా ఇచ్చాడు”. మూసీనదికి వరదలు సంభవించినప్పుడు వాయనం సమర్పించాడు. భద్రాద్రి రాముడి కళ్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేశంలో భగవద్గీత వివిధ భాషల్లోకి అనువధించేందుకుగానూ విరాళాలు ఇచ్చారు. ఇంకేంకావాలి.. మన రాజు సెక్కులర్ అని చెప్పడానికి.
హైదరాబాద్, డిసెంబర్ 1 (జనంసాక్షి) : నిజాముల పాలన తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. అంతేకాదు.. దేశానికే మార్గదర్శకంగా మారింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశ తొలి ప్రధాని నెహ్రూ ‘మినీ ఇండియా’గా పేర్కొన్నారు. దేశం అభివృద్ధికి తాను కన్న కళలన్నీ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయని కితాబిచ్చారు. అలాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని వలస వాదులొచ్చి సర్వనాశనం చేశారు. తెలంగాణ సంపదను సర్వం దోచుకుని దాచుకున్నారు. అంతటితో ఆగకుండా.. తెలంగాణను తామే అభివృద్ధి చేశామని నిస్సిగ్గుగా నోరుపారేసుకుంటున్నారు. ఇంతకీ.. తెలంగాణ అభివృద్ధికి నిజాములు కృషి చేశారా..? లేక ఇన్నాళ్లూ పాలించిన ఆంధ్రా పాలకులు కృషి చేశారా..? అనే విషయాలపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.
నెహ్రూను ఆకర్షించిన నిజాం పాలన…
హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ నిర్మించి ప్రజలందరికీ మంచినీటి వసతి కల్పించారు. ఈ సాగర్ ఒడ్డున 1910లో థర్మల్ పవర్ ప్లాంటును స్థాపించి దక్షిణ భారతదేశంలోనే మొదటి సారిగా విద్యుత్ వెలుగులతో కాంతులీనిన హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దారు. తెలంగాణకు కరెంటు వచ్చిన 17 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు, మద్రాసు నగరానికి విద్యుత్ వెలుగులు అందాయి. దీంతో దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిసిటీ నగరంగా 1930లో హైదరాబాద్ ఎంపికైంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని పారిశ్రామికతకు, వ్యవసాయానికి, విద్యావిస్తరణకు, ప్రజారవాణా పటిష్టతకు ఇలా వివిధ అంశాల అభివృద్ధికి నిజాం పాలకులు అవిరళ కృషి చేశారు. తద్వారా ప్రజల మన్ననలు పొందారు. యావత్ దేశానికే తమ పాలనను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు. వాటిలో కొన్నింటిని అంశాల వారీగా పరిశీలిద్దాం.
పారిశ్రామిక హబ్‌గా తెలంగాణ ప్రసిద్ధి…
1871లోనే తెలంగాణను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేశారు. పారిశ్రామికీకరణలో భాగంగా నిజాం సర్కార్ స్థాపించిన కంపెనీలను మచ్చుకు కొన్నింటిని తెలుసుకుందాం. 1871లో సింగరేణి కాలరీస్, 1873లో స్పిన్నింగ్ మిల్స్, 1866లో కస్టమ్స్ ఫ్యాక్టరీ, 1910లో ఐరన్ ఫ్యాక్టరీ, 1919లో విఎస్‌టి ఫ్యాక్టరీ, 1921లో కెమికల్ ల్యాబొరేటరీ, 1927లో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, 1929లో రాంగోపాల్ కాటన్ ఫ్యాక్టరీ, 1933లో కోహినూర్ వజ్రాల ఫ్యాక్టరీ, 1941లో గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్థాపించారు. 1956 వరకు.. అంటే.. తెలంగాణలో ఆంధ్రరాష్ట్రం విలీనం అయ్యే సమయానికి తెలంగాణ ప్రాంతంలో మొత్తం 50 స్టీల్ ఫ్యాక్టరీలున్నాయి. నాలుగు ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ కంపెనీలు ఏర్పడ్డాయి. అప్పటికే హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ముషీరాబాద్, అజామాబాద్ ప్రాంతాలు పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందాయి. 1942లో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో అల్విన్ కంపెనీని స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు.
ప్రముఖ సంస్థల ఏర్పాటుకు కృషి…
హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం 1896లో ఇరిగేషన్ విభాగం, 1913లో అగ్రికల్చర్ విభాగాలను స్థాపించారు. అలాగే నగరంలో శాంతిభద్రతల స్థాపన కోసం 1893లోనే పటిష్టమైన పోలీసింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పి అభివృద్ధివైపు అడుగులు వేశారు. రాష్ట్ర ప్రజలకు సరైన న్యాయం అందించే దృక్పథంతో 1870లోనే హైదరాబాద్‌లో హైకోర్టును నిర్మించారు. ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న అసెంబ్లీ భవనాన్ని కూడా నిజాములు నిర్మించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను యావత్ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు 1932లో ఆకాశవాణి కేంద్రాన్ని నెలకొల్పారు. తద్వారా సమాచార వ్యవస్థను విస్తృతం చేశారు. అంతేకాదు.. తమ ప్రజలకు టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ కావాలని సంకల్పించి 1885లోనే టెలీఫోన్ సౌకర్యాన్ని సమకూర్చారు. 1856లో మొదటి పోస్టాఫీస్ హైదరాబాద్‌లో ఉండేది. 1940కి ముందే హైదరాబాద్‌లో ఎన్నో పత్రికలున్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి అభివృద్ధి చెందాకనే సీమాంధ్రులు తెలంగాణకు వచ్చారు. దీన్నిబట్టి సీమాంధ్రులు రాకముందే తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అప్పటికే హైదరాబాద్ ఆదాయం సర్‌ప్లస్ ఉన్నది. లక్షల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఉన్నది.
భారీ ఎత్తున విద్యాసంస్థల స్థాపన…
హైదరాబాద్ రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సదుద్దేశంతో నైజాం పాలకులు భారీ ఎత్తున విద్యాసంస్థలను నెలకొల్పారు. స్కూళ్లు, కాలేజీలు, వర్శిటీలు, హైదరాబాద్ పబ్లిక్‌స్కూళ్లు వంటి విద్యాసంస్థలను భారీగా నిర్మించారు. అందుకు అత్యుత్తమమైన విద్యావిధానాన్ని రూపొందించారు. పేదలు చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొనసాగుతున్న స్కాలర్‌షిప్ విధానం నైజాములు ప్రవేశపెట్టిన పథకమే. ఈ ఉద్దేశంతో 1872లోనే స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యనభ్యసించేందుకుగానూ ప్రధానంగా నాలుగు భాషల్లో ఈ విద్యావిధానాన్ని రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. ఆ భాషలు హిందీ, ఉర్దూ, తెలుగు, ఆంగ్లం. అప్పట్లోనే హైదరాబాద్ నగరంలో 16 ప్రభుత్వ స్కూల్స్ ఉండేవి. పై చదువులు చదివేందుకు ప్రముఖ విశ్వవిద్యాలయాలు స్థాపించారు.1894లో మెడికల్ కాలేజీ, 1920లో సిటీ కాలేజీ, అదే సంవత్సరంలో ఉస్మానియా యూనివర్శిటీ, 1921లో ఉస్మానియా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. అంతకంటే ముందే హైదరాబాద్ నగరంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యను 1869లోనే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు.. ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 1872లోనే మొదటి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుత రాజకీయ నాయకులు అశోక్‌గజపతిరాజు, పళ్లంరాజు, కిరణ్‌కుమార్ రెడ్డి లాంటి సీమాంధ్రకు చెందిన వారే ఎక్కువగా ఈ స్కూళ్లలో చదువుకున్నారు. అంతేకాదు.. పేదలు చదువుకునేందుకు 1897లో స్టడీస్కీవమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్కీం ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసేది. ఈ స్కీం ద్వారానే భారత నైటింగేల్‌గా ప్రఖ్యాతిగాంచిన సరోజినీనాయుడు లండన్‌కు వెళ్లి విద్యనభ్యసించారు.
ప్రజారవాణాపై దీర్ఘదృష్టి…
హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి వేగంగా జరగాలంటే.. అందుకు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థ ఉండాలనే సత్సంకల్పంతో పటిష్టమైన ప్రజారవాణాను రూపొందించారు. 1866లోనే రైలు మార్గాన్ని వేశారు. ఇది బాంబే నుంచి రాయచూర్ వరకు ఉండేది. హైదరాబాద్‌లో రైల్వే వ్యవస్థను నిజాములే ఏర్పాటు చేశారు. ఇక విమానాయానానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బేగంపేట, హకీంపేట విమానాశ్రయాలు నిజాములు స్థాపించినవే. ప్రజారవాణాను తెలంగాణ ప్రజలకు మరింత చేరువచేసేందుకు 1932లో ఆర్టీసిని స్థాపించారు. రైలు, విమాన మార్గాల ద్వారా దూరపు ప్రయాణాలకు మాత్రమే అవకాశం ఉండేది. దీన్ని దగ్గరి ప్రయాణాల ఆర్టీసిని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసి అందుబాటులోకి రావడంతో ప్రజారవాణా మరింత సులభతరమై అభివృద్ధి వేగానికి నాందిపలికింది. అదేవిధంగా రోడ్డు మార్గాలను కూడా అభివృద్ధి చేశారు. మొట్టమొదటి సారిగా సిమెంటు రోడ్లను హైదరాబాద్‌లోనే నిర్మించారు. అట్టడుగు ప్రజల రవాణా కోసం తన భార్య ‘మహర్ డబ్బుల’తో ఆర్టీసిని స్థాపించి లాభనష్టాలు ఆశించకుండా అత్యుత్తమ సేవలందించారు.
సామాజిక కార్యక్రమాలకూ నిజాముల సాయం…
హైదరాబాద్ రాష్ట్రంలో పలు సామాజిక కార్యక్రమాలకు కూడా నిజాములు విరివిగా విరాళాలు అందించేవారు. 1962లో ‘భారత్ – చైనా’ యుద్ధం సందర్భంగా భారత్ చైనాతో పోరాడేందుకు నిజాం పాలకులు 120 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పట్లోనే దాని విలువ రూ.9 కోట్లు ఉన్నది. అలాగే దేశంలో భగవద్గీతను తర్జుమా చేసేందుకు కూడా నిజాం నవాబులు విరాళాలు అందజేశారు. హిందూ బెనారస్ యూనివర్శిటీకి రూ.10 లక్షలు, ముస్లిం అలీఘడ్ వర్శిటీకి రూ.5 లక్షలు చెందాలు అందజేశారు. దీంతో తమకున్న లౌకికతత్వాన్ని నిరూపించుకున్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న అండర్ డ్రైనేజీ వ్యవస్థ కూడా నిజాములు రూపొందించినదే. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్, చార్మినార్, పురానాపూల్, హనుమాన్ వ్యాయామశాల, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ వంటి చారిత్రకమైన నిర్మాణాలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కొరతలేకుండా చూశారు. ఇలాంటి అత్యున్నతమైన, చారిత్రక నేపథ్యం కలిగిన అభివృద్ధి పనులను నిజాం పాలకులు చేస్తే.. నేటి సీమాంధ్ర పాలకులు దాన్ని దాచిపెడుతూ.. హైదరాబాద్‌నే తామే అభివృద్ధి చేశామనడం వెనుక వారి కుట్ర ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణను కొల్లగొట్టడమే.. సీమాంధ్రుల పాలన…
1956 కంటే ముందే హైదరాబాద్ రాష్ట్రం నిజాంపాలకుల కాలంలో అన్నివిధాలా అభివృద్ధి చెంది మిగులు బడ్జెట్‌తో బాసిల్లింది. కానీ.. 1956లో సీమాంధ్రులు తెలంగాణకు వలసొచ్చాక.. హైదరాబాద్ రాష్ట్రలో ఉన్న అభివృద్ధి గణనీయంగా పడిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ అంధ్రాకు తరలిపోయాయి. నిజాములు స్థాపించిన పెద్దపెద్ద కంపెనీలు కారుచౌకగా అమ్ముడుపోయాయి. దీంతో లక్షలాది మందికి ఉపాధి దెబ్బతిన్నది. 1984లో ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే హుస్సేన్ ఒడ్డున ఉన్న.. హైదరాబాద్‌కు మొదటిసారిగా విద్యుత్ వెలుగులు అందించిన సాగర్ థర్మల్ పవర్ ప్లాంటును కారుచౌకగా, అత్యంత తక్కువ ధరకు రూ.6 కోట్లకు అమ్మేశారు. నిజాం షుగర్‌కు అదే గతిపట్టించారు. ఏదో పైపైన రోడ్లుకు మెరగులు దిద్ది.. రోడ్లపై ఇంత తారు పోసి హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ తమవల్లే వచ్చిందంటున్నారు. అసలు తెలంగాణ అభివృద్ధి నిజాం కాలంలోనే జరిగిందన్న విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం సీమాంధ్రుల కుట్రలకు అద్దంపడుతోంది. సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను ఆక్రమించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో హైదరాబాద్ చుట్టూత ఉన్న కొండలు, గుట్టలు, శ్మశానాలు, దర్గాలను సైతం వదలకుండా కబ్జాలు చేశారు. దళిత, బహుజనుల అసైన్డ్ భూములనూ లాక్కున్నారు. వక్ఫ్ భూములను కూడా వదలకుండా వేల ఎకరాల్లో పాగా వేసి ల్యాంకో హిల్స్ అని, గురుకుల్ ట్రస్టులని ఆకాశహార్మ్యాలను నిర్మించారు. వేలు, వందల ఎకరాల్లో సినీ స్టూడియోలు నిర్మించుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆంధ్రోళ్లంతా భూబకాసురులుగా మారారని చెప్పవచ్చు. ఇలా తెలంగాణ భూములు, నీళ్లు, నిధులు కొల్లగొట్టి మొత్తం తెలంగాణ అభివృద్ధిని విధ్వంసం చేశారు.
కాకతీయ, శాతవాహన, నిజాంల ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలి…
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాకతీయులు, శాతవాహనుల ఉత్సవాలను నిర్వహించాలని యోచిస్తోంది. వారితోపాటు.. నిజానికి తెలంగాణను అభివృద్ధి చేసిన నిజాం పాలకుల ఉత్సవాలను కూడా ఈ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసిన నిజాములకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం తన పరిశీలనగా తీసుకోవాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.