నిజామాబాద్‌లో తిరుగులేని కవిత
ఆమెపై పోటీ అంటేనే భయపడుతున్న కాంగ్రెస్
మధుయాష్కీ మరో ప్రాంతం చూసుకోవడంపై విమర్శలు
నిజామాబాద్,మార్చి4(జనంసాక్షి): ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నేతలెవరూ ముందుకు రాకపోవడం హస్తం పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. మాజీ ఎంపి మాధుయాష్కీ సైతం ఇక్కడి నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో కవిత బంపర్ మెజార్టీతో గెలవడమే గాకుండా ఆమెకు తిరుగు లేదన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లోనే జరుగుతోంది. ఇంతకన్నా అవమానం ఉండదన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. కవిత గత ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలతో నియోజకవర్గ ఇమేజ్‌ను పెంచారని అంటున్నారు. ఆమెతో గెలవడం ఇక కష్టం అన్న స్థాయికి దీనిని తీసుకుఎని వచ్చారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు, మాజీ ఎంపీ మధుయాష్కి పేరును నిజామాబాద్‌తో పాటు భువనగిరి స్థానం నుంచి ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. రెండు పర్యాయాలు నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించి, గత ఎన్నికల్లోనూ పోటీ చేసిన మధుయాష్కి.. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రత్యామ్నయ స్థానం కోసం వెతకడం ఎంత వరకు సమంజసమని ఆయన పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ఇన్నాళ్లు మధుయాష్కి ఉన్నారనే ఉద్దేశంతోనే ఇతర నేతలు ఎంపీ అభ్యర్థిత్వం గురించి ఆలోచించ లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరో పక్షం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్న ఈ సమయంలో తీరా మధుయాష్కి ప్రత్యామ్నయ స్థానం వైపు మొగ్గుచూపుతుండటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం
పాలైన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల పర్వం పెద్ద సవాల్‌గానే మారనుంది. నిజామాబాద్ పార్లమెంట్
స్థానానికి అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. రాష్ట్రంలో ఇతర పార్లమెంట్ స్థానాల అభ్యర్థిత్వాలకు పోటాపోటీ నెలకొనగా, నిజామాబాద్ స్థానం విషయానికి వస్తే మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు నేతలెవరూ ఆసక్తి చూపక పోవడంతో అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానానికి ఒకింత సవాల్‌గా మారింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం కోసం ఐదుగురు పేర్లతో జాబితాను ఇవ్వాలని పీసీసీ ఎన్నికల కమిటీ సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నలుగురు పేర్లతో కూడిన జాబితాను అందజేసింది. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ పేరును కూడా డీసీసీ అందజేసింది. మరోవైపు, డీసీసీ ప్రతిపాదించిన మిగతా ముగ్గురు కూడా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎంపీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో చేతులు కాల్చుకునేందుకు వీరు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేక పోయింది. ఇన్ని సవాళ్ల మధ్య పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే ధోరణిలో హస్తం పార్టీ నేతలున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తేనే ఇద్దరు నేతలు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇది టిఆర్‌ఎస్‌కు పార్టీ పరంగా పెద్దవిజయంగా భావించాలి.