నిజామాబాద్‌లో పడగ విప్పిన కల్తీ కల్లు
37 మందికి అస్వస్తత
నిజామాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి) :
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం కాళ్లకల్‌లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనను మరువక ముందే నిజామా బాద్ జిల్లాలోనూ మరో కల్తీ కల్లు సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బుధవారం నిజామాబాద్ నగరంలోని అమల ్‌వాడి, రాందేవ్‌వాడ, అర్సపల్లి, సీతారాంనగర్ కాలనీ, మిర్చి కాంపౌండ్, అశోక్‌నగర్‌లో ఉన్న కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగి 37 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కల్లు దుకాణాలు మూసేస్తారన్న ఉద్దేశంతో వీరు మోతాదుకు మించి కల్లు తాగినట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి బాధితులు జిల్లా ఆస్పత్రిలో చేరటం ప్రారంభించారు. మరికొందరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కల్లులో మోతాదుకు మించి అల్ఫోజాం కలిపినందున ఇలా జరిగిందా లేక మోతాదుకు మించి తాగినందుకు జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదిలా ఉండగా, మెదక్ జిల్లాలోని కాళ్లకల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో 23 టీఎఫ్‌టీ కల్లు దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు గజ్వేల్ ఎక్సైజ్ శాఖ అధికారి వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు.