కీలక ఖనిజ రంగంలో తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్‌ గుర్తింపు

` సింగరేణి సంస్థకు నీతి ఆయోగ్‌ జాతీయ కమిటీలో చోటు
` రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు
` 2300 మెగావాట్ల థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాజస్థాన్‌ క్యాబినెట్‌ ఆమోదంపై హర్షం
హైదరాబాద్‌్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఖనిజ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ కార్యాచరణ ప్రారంభించి మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందున్న నేపథ్యంలో దేశవ్యాప్త గుర్తింపును పొందుతుందని, ఇటీవల నీతి ఆయోగ్‌ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కీలక ఖనిజ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి ప్రముఖ స్థానం కల్పించడం దీనికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు.ఈనెల 19వ తేదీన నీతి ఆయోగ్‌ ప్రకటించిన జాతీయ స్థాయి కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ కమిటీలో సింగరేణి సంస్థ కు ప్రాధాన్యతనిస్తూ ఆ సంస్థ సీఎండీని సభ్యునిగా పేర్కొంటూ ఆఫీస్‌ మెమొరాండం విడుదల చేసిన నేపథ్యంలో శ్రీ భట్టి విక్రమార్కమల్లు గురువారం ఈ ప్రకటన చేశారు.దేశ అవసరాలకు కీలకమైన కీలక ఖనిజాల అన్వేషణను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, రష్యా, ఘనా వంటి దేశాలతో వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చలు జరుపుతున్నామని, కీలక ఖనిజరంగంలో గల అవకాశాలను అధ్యయనం చేయటానికి ఇప్పటికే ఏజెన్సీలను నియమించుకున్నామని తెలిపారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్‌ కూడా సాధించిందన్నారు.సింగరేణి ప్రాంతంలోని గుట్టల్లో, ఓపెన్‌ కాస్ట్‌ గనుల మట్టిలో, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్‌ బాటమ్‌ యాష్‌ లో ఉన్న కీలక ఖనిజాలు, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ను గుర్తించడానికి, వాటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలపై కలిసి పని చేసేందుకు జాతీయస్థాయి సంస్థలైన ఎన్‌ ఎఫ్‌ టి డి సి, ఐఎంఎంటీ, జె ఎన్‌ ఏ ఆర్‌ డి డి సి వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు.అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వ దిశా నిర్దేశంలో సింగరేణి కీలక ఖనిజ రంగంలో అవలంబిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర గనుల శాఖకు రాసిన లేఖలోనూ కీలక ఖనిజాల విషయంలో సింగరేణి మోడల్ను స్వీకరించాలని ప్రస్తావించడం మన రాష్ట్ర విధానాలకు జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపుగా భావించవచ్చన్నారు.అలాగే గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ సింగరేణి విస్తరణ కోసం ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్జీఇఎల్‌ సంస్థతో కలిసి పని చేయడానికి కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.2300 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లకు రాజస్థాన్‌ క్యాబినెట్‌ ఆమోదం హర్షణీయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రాజస్థాన్‌ విద్యుత్‌ ఉత్పదాన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తో కలిసి సింగరేణి సంస్థ 2300 మెగావాట్ల థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనకు కుదుర్చుకున్న ఒప్పందానికి బుధవారం ఆ రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపడం హర్షనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాలకు మేలు చేసే విధంగా మరియు దేశ విద్యుత్‌ అవసరాలకు తగిన విధంగా సహకరించేందుకు ఈ మెగా ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టామన్నారు. రాజస్థాన్‌ రాష్ట్ర క్యాబినెట్‌ అనుమతి లభించింది కాబట్టి రాజస్థాన్‌ లోని సోలార్‌ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న 1500 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ కు కావలసిన స్థలం త్వరగా సమకూరుతుందన్నారు. ఒప్పందంలో భాగంగా మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్‌ ను ప్రస్తుత మంచిర్యాల సమీపంలో గల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. క్యాబినెట్‌ సమావేశంలో సింగరేణి – రాజస్థాన్‌ విద్యుత్‌ ఉత్పాదన నిగం లిమిటెడ్‌ ఒప్పందానికి అనుమతి ఇచ్చిన రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి తన అభినం దనలు శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో సింగరేణిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ శ్రీ ఎన్‌.బలరామ్ను ఆదేశించారు.