ఇంటలీజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ పెట్టుబడులకు వేదికగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి
` తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌ ప్రారంభం
హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని, తాము పక్క రాష్ట్రాలతో కాకుండా దుబాయ్‌, సింగపూర్‌ లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ వేదికగా 6 రోజుల పాటు రెండు విడతలుగా జరిగే తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌ను గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్‌, సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి హాజరయ్యారు. త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనా రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు పాటు 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 600 మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో మొదటి దశ ఫెస్టివల్‌లో సినిమాలు, సాహిత్యం వంటి అంశాలపై సెమినార్లు, చర్చా గోష్టిలు, ప్రదర్శనలు ఉంటాయని, 25 నుంచి 27 వరకు సాగే 2వ విడతలో ఆరోగ్యం, సాంకేతికత వంటి అంశాలపై చర్చలు ఉంటాయని చెప్పారు. రోజూ 2వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 40 మంది పౌర పురస్కార విజేతలు కూడా దీనికి హాజరవుతారని గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి దాన కిశోర్‌ తెలిపారు.రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారసత్వం ఇచ్చి పుచ్చుకోవడానికే కాదు ఒకరి ఉత్పత్తులు మరొకరు అమ్మడానికి, కొనడానికి దోహదం చేస్తుందని త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. సంస్కృతి, సహజ వనరుల పరంగా ఈశాన్య రాష్ట్రాలు ఎంతో గొప్పవని.. మన దేశం అతిథి దేవో భవ అంటే వారు అభివృద్ధి దేవో భవ అంటున్నారని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందరికీ చేరడమే అసలైన అభివృద్ధి అన్నారు. తొలి రోజు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులకు గవర్నర్‌ బహుమతులు అందజేశారు. మిజోరాం యువజన సర్వీసులు, క్రీడల మంత్రిని సీఎం రేవంత్‌ రెడ్డి సన్మానించారు.