శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్

జనంసాక్షి వెబ్ డెస్క్ : మారేడుమల్లి ఎన్కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాడ్వి హిడ్మా రాజేల తోపాటు మరికొంతమందిని తీసుకొని వెళ్లి హత్య చేసి ఎన్కౌంటర్ గా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. అలాగే రంపచోడవరంలో ఏవోబి రాష్ట్ర కార్యదర్శి శంకర్ తో పాటు మరికొంతమందిని హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపు నిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్లు అసువులు బాసిన కామ్రేడ్ల ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తున్నామన్నారు.

మావోయిస్టు లేఖ ప్రకారం.. నేడు దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా, అతని సహచరి కామ్రేడ్ రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ఐబీ నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలు. తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి, ఉద్యమ స్పూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్ శంకర్ (ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు), కామ్రేడ్ రాజే (రీజినల్ కమిటీ సభ్యురాలు) లకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. కామ్రేడ్ చైతు (పీపీసీఎం), కామ్రేడ్ కమూ (పీపీసీఎం), కామ్రేడ్ మల్లాల్ (పీపీసీఎం), కామ్రేడ్ దేవే (పీఎం) లు తమ కర్తవ్య నిర్వహణలో తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్పూర్తిని నిలబెట్టిన వీరికి సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోంది.

కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, పువ్వర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్ లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయ్యి, 1998 చివరి వరకు బాసగూడ దళంలో పనిచేసాడు. 1999లో గడ్చిరోలీలో పనిచేసాడు. తరువాత ఒక సంవత్సర కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేసాడు. 2001లో ఏరియా కమిటీ సభ్యుడయ్యి, దక్షిణ బస్తర్ కు వచ్చాడు. 2002లో ఊసూర్ ఎల్డీఎస్ కమాండర్ గాను, కొద్దికాలం కుంట ఎల్డీఎస్ కమాండర్ గాను పనిచేసాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. తరువాత కంపెనీ-2లో పీఎల్ కమాండర్ గా పనిచేసాడు. 2006 నుండి 2009 వరకు కంపెనీ-3 కమాండర్ గాను, కార్యదర్శిగాను పనిచేసాడు. 2009 లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేసాడు. 2011లో బీఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2020లో సెక్రటేరియట్ సభ్యుడయ్యాడు. 2024 ఆగస్టులో ఎస్.జెడ్.సీ. కార్యదర్శిగాను, కేంద్రకమిటీ సభ్యుడిగాను ప్రమోట్ అయ్యాడని మావో లేఖలో పేర్కొన్నారు.