నిన్ను నమ్మరు ‘బాబూ’ !
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి ఈ నెలతో ఎన్నిమిదిన్నరేళ్లు పూర్తయింది. ఈ మధ్య కాలంలో ఆయన ఏనాడూ బడుగు బలహీనవర్గాలు, మైనార్టీలు, రైతు సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదు. ఇప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు అందరూ గుర్తుకు వస్తున్నారు. ఇప్పుడు అణగారినవర్గాల సమస్యలు తెలిసివస్తున్నాయి ! ‘వ్యవసాయం దండగ’ అన్నందుకు రైతులే తాను పదవి కోల్పోవడానికి కారణం అనుకున్నాడో ఏమో, రైతు యాత్రలు చేపట్టాడు. కానీ, అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో మళ్లీ కొంతకాలం నైరాష్యం. తర్వాత తెలంగాణకు నేను వ్యతిరేకం కాదని, కొత్తపాట పాడడం మొదలు పెట్టాడు. ఈ సాకుతోనైనా తెలంగాణలో పర్యటిద్దామనుకున్నాడు. కానీ, ‘అప్పుడు రెండు కళ్ల సిద్ధాంతమని, వచ్చిన రాష్ట్రాన్ని అడ్డుకుని, మళ్లీ మా ఇలాఖాలోకి వస్తావా.. రా.. నీ సంగతి చెబుతా..’ అన్న తెలంగాణ ఉదమ ఉధృతి వల్ల ఇక్కడ కూడా పర్యటించలేకపోయాడు. దీంతో ఎలాగైనా 2014లో మళ్లీ సీఎం పదవి చేపట్టాలన్న పదవీకాంక్షతో బుర్రను పరిపరి విధాలా ఆలోచింపజేశాడు. అప్పుడే ఓ దుష్టపన్నాగం ‘బాబు’ మనసులో మెదిలింది. అదే నాడు ఆంగ్లేయులు పాటించిన ‘విభజించు.. పాలించు” అన్న సిద్ధాంతం. ఈ హేయమైన సిద్ధాంతానికి అమాయక ముసుగు తొడిగాడు. వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాడు. బీసీలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించాడు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు, అధికారం పోయాక గడిపిన ఈ ఎనిమిదిన్నరేళ్లలో బీసీలకు 100 సీట్లివ్వాలని ‘బాబు’కు ఏనాడూ అనిపించలేదు ! అంతేనా.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి, ఆ వర్గాన్ని రెండుగా విడదీశాడు. ఈ వర్గీకరణ అంశం కూడా నారా వారికి ఇప్పుడే గురుకతకొచ్చింది. ఇక ముస్లింలకు గాలం ఎలా వేద్దామా.. అని ఆలోచిస్తుంటే ‘రంజాన్’ మాసం వచ్చింది. ఇదే అదనుగా రంజాన్ నెలలో ముస్లింలకు ఇఫ్తార్ విందులిస్తున్నాడు. టోపీలు పెట్టుకుని తిరుగుతూ, ‘ఆదాబర్సే, అస్సలాము అలైకుం’ అంటూ చేతులూపుతున్నాడు. బాబుకు ఇంకా ఒక విషయం తెలిసినట్లు లేదు. 2004 ఎన్నికల్లో బాబు పార్టీని మట్టి కరిపించిన వారిలో ప్రధాన పాత్ర ముస్లింలదే. ఎందుకంటే, ముస్లింల ఆగ్రహం అలాంటిది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగానే, గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోశారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, కనీసం ఆ మారణకాండను ఖండించడం కూడా చేయలేదు. కనీస పరామర్శ సందేశాలూ ఇవ్వలేదు. ఆఖరికి మొన్న బీహార్ సీఎం నితీష్‌కుమార్‌లా మోడీని వ్యతిరేకించలేదు. ఎందుకంటే, నాడు దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో బాబు అండ్ కో కంపెనీ భాగస్వామి కనుక. ఒకవేళ బాబు నితీష్‌లా, మోడీ ఆడిన మృత్యుకేళిని వ్యతిరేకించినా, నేడు ముస్లింలు నమ్మేవారేమో ! కానీ, నాడు గుజరాత్‌లో 2000 మంది ముస్లింలు హాహాకారాలు చేస్తుంటే, రాష్ట్ర ముస్లింలు బిక్కుబిక్కుమంటూ, తమ సాటివారి కష్టాలను చూసి ఏమీ చేయలేక కన్నీళ్లు కారుస్తుంటే, చంద్రబాబు మౌనవ్రతంలో ఉన్నాడే గానీ, పట్టించుకోలేదు. ఫలితంగా, అంతమంది ముస్లింల ఊచకోతకు పరోక్షంగా కారణమయ్యాడు. నాడు బాబు ఎన్డీఏలో చక్రం తిప్పిన ‘నారా’ కనీసం, ‘గుజరాత్‌లో ముస్లింలపై అరాచకాన్ని ఖండిస్తున్నాం’ అని అనుంటే, ఎన్డీఏ అత్యవసర చర్యలు తీసుకునేదేమో ! ప్రధాన మిత్ర పక్షంగా టీడీపీ మాట వినేదేమో ! దీంతో అంతమంది ముస్లింలు మత మౌఢ్యుల దురాగతానికి బలయ్యేవారు కాదేమో ! కానీ, అప్పుడు బాబు వ్యవహరించిన తీరు గర్హనీయం. ఇంత కర్కషంగా వ్యవహరించిన బాబు నేడు టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ పార్టీలిస్తే ముస్లింలు కరిగిపోతారనుకుంటే, అది బాబు మూర్ఖత్వమే అవుతుంది. ముస్లింల మదిలో బాబుకు ఆవగింజంత స్థానం కూడా లేదు. ఉన్నా అది గుజరాత్ మారణకాండతోనే చెరిగిపోయింది. నేడు బీసీలు, బడుగు బలహీనవర్గాలన్నీ ముస్లింలతోనే ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఈ వర్గాలను నాడు పట్టించుకోని ‘బాబు’ నేడు నేనేదో చేస్తానంటే, బడుగులు వినడానికి సిద్ధంగా లేదు. బలవంతంగా వినిపించినా, విన్న పది నిమిషాలకే చెవులు దులిపేసుకుంటారు తప్ప బాబుకు మళ్లీ అధికారం కట్టబెట్టరు. మూడోసారి సీఎం కావాలని బాబు కంటున్న కలలు కల్లలవడం ఖాయం !