నిరుద్యోగ యువతకు శాపంగా మారిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు

నల్లబెల్లి అక్టోబర్ 21 (జనం సాక్షి):
నిరుద్యోగ యువతకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు శాపంగా మారాయని ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది యువకులు ఆ పార్టీని వీడి దొంతి మాధవరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలను అమ్మడంలో ఉన్న శ్రద్ధ నిరుద్యోగ, ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువత ముందుకు రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజల బ్రతుకులు మారుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, మండల యువజన సంఘం అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, జంగిలి మోహన్, ఇస్తారి శేఖర్,జెట్టి రామ్మూర్తి, గోపాల్ రావు, రాజు, రఘుపతి, నాగరాజు, మధు, గణేష్ పాల్గొన్నారు.
Attachments area