నిర్బంధానికి నిరసనగా తెలంగాణ బంద్‌ సక్సెస్‌

జంట నగరాలతో సహా స్తంభించిన జనజీవనం
డిపోలకే పరిమితమైన బస్సులు
బలవంతంగా తిప్పిన చోట ప్రయాణికులు కరువు
బంద్‌ విఫలం చేయడానికి సర్కారు సర్వ ప్రయత్నాలు
స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యా, వాణిజ్య సంస్థలు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు
హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :
చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుకునిరసనగా టీఆర్‌ఎస్‌, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ తెలంగాణ జిల్లాల్లో విజయవంత మైంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాల లు, కళాశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు మూసివేశారు.  హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఉద్యోగులు బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. బంద్‌ సందర్భంగా అక్కడక్కడ విద్వంసకర సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తెల్లవారు జామునే టీఆర్‌ ఎస్‌ శ్రేణులు ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట భైఠాయించారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. దీంతో హెచ్చు సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని జిల్లాల్లో పోలీసులు బలవంతంగా బస్సులు తిప్పినా ప్రజలు లేక వెలవెలబోయాయి. దీంతో ఆయా సర్వీసులు అంతంతమ మాత్రంగానే నడిచాయి. సుదూర ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. మావోయిస్టులు బంద్‌కు మద్దతి వ్వడంతో ఆర్టీసీ అటవీ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస ్‌నుంచి నాలుగువేల బస్సులు రోజంతా తిరుగతుండేవి బంద్‌ సందర్భంగా బస్‌స్టేషన్‌కే బస్సులు పరిమితమయ్యాయి. గంట గంటకు వేలాది మంది ప్రయాణికుల రాకపో కలతో బిజీ బిజీగా కనిపించే బస్సుస్టేషన్‌లో కేవలం కొద్దిమంది మాత్రమే కనిపించడంతో బోసిపోయింది. సిద్దిపేటలో హరీశ్‌రావు నేతృ త్వంలో ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆందో ళన చేస్తున్న చోటుకి చేరుకొని హరీశ్‌ సహా కార్యకర్తలను అరెస్ట్‌ చేసి వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. పద్మా దేవందర్‌రెడ్డి నేతృత్వంలో రామాయంపేట బస్సు డిపో ఎదుట దర్నాకు దిగారు. అనంతరం రోడ్డుపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. దీంతో ఆమెతోపాటు పలువురిని అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. సంగారెడ్డిలో మాత్రం జగ్గారెడ్డి వర్గీయులు, పోలీసులు బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తే జగ్గారెడ్డి వర్గీయులు తెరవాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా సోఫినగర్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌స్టాండ్‌వద్ద ధర్నాకు దిగిన జిల్లా కన్వీనర్‌ ఈద శంకర్‌రెడ్డితోపాటు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, తదితరులను అరెస్ట్‌ చేశారు. గోదావరిఖనిలో డిపోకు టీిఆర్‌ఎస్‌ కార్యకర్తలు తాళాలు వేసారు. జిల్లాలోని తిమ్మా పూర్‌ మండలం రేణిగుంట వద్ద ఆర్టీసీ బస్సుతోపాటు లారీ అద్దాలను పగులగొట్టారు ఆందోళనకారులు. ఈక్రమంలో పలు ఆర్టీసి బస్సులు డ్యామేజ్‌ అయ్యాయి. వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే భిక్షపతిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హన్మకొండలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే వినయ్‌సాగర్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు 50 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి ఠాణాకు తరలించారు.
సోన్‌ సమీపంలో మరో బస్సు అద్దాలను పగులగొట్టారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో ఆర్టీసీ బస్సుల గాలితీశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఎద్దుట్ల, రేమద్దెల గ్రామాల మధ్య రెండు ఆర్టీసీ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారు జామున నిప్పు పెట్టారు. వనపర్తి డిపోకు చెందిన ఒక బస్సు పూర్తిగా దహనవగా, మరొకటి పాక్షికంగా ధ్వంసమైంది. ఘటనా స్థలా న్ని వనపర్తి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు. బంద్‌ సందర్బంగా ఓయూతో పాటు కేయూలో శనివారం జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి గనుల్లో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అనంతరం విధులకు హాజరయ్యారు. చలో అసెంబ్లీ సందర్భంగా తెలంగాణలో పోలీసులు సృష్టించిన  బీభత్సకాండకు నిరసనగా కేసీఆర్‌ పిలుపుమేరకు బంద్‌ విజయవంతం అయిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కునే రీతిలో కిరణ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చెదురు మదురు ఘటనలు మినహా బంద్‌ సక్సెస్‌ అయింది.