నిర్భయకు డాటరాఫ్‌ ఇండియా అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) :
కమాంధుల కర్కషత్వానికి బలైపోయిన పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయకు కేంద్ర ప్రభుత్వం డాటరాఫ్‌ ఇండియా అవార్డు ఇచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో అర్ధరాత్రి నడుస్తున్న బస్సులో ఆమెపై సామూహిక అత్యాచారాని ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా ఇనుప రాడ్లతో కొట్టి గాయపరిచి నడుస్తున్న బస్సులోంచి తోసేశారు. తీవ్రగాయాలతో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాలంలో బతకాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఛిద్రమైన ఆమె శరీరం సంకల్పం ముందు ఓడిపోయింది. ఆమె చూపిన తెగువకూ యావత్‌ భారత్‌ సలామ్‌ చేసింది. ప్రపంచ దేశాలు ధైర్యాన్ని కీర్తించాయి. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్భయ తల్లిదండ్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ డాటర్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును ప్రదానం చేశారు.