నిలకడగా వంశధార,నాగావళి
అయినా నీటిలోనే పలు గ్రామాలు
శ్రీకాకుళం,ఆగస్ట్16(జనం సాక్షి): ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రమాదకరస్థాయిలో ఉన్న వంశధార, నాగావళి నదులు ఇప్పుడు నిలకడకగా కొనసాగుతున్నాయి. గొట్టా బ్యారేజీ 22 గేట్లను ఎత్తివేసిన అధికారులు 67,297 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వంశధార నదికి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విజయనగరం తోటపల్లి ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా 9,914 క్యూసెక్కులు విడుదల చేశారు. నాగావళి ప్రాజెక్టు నుంచి తోటపల్లి ప్రాజెక్టుకు 25,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు విడుదల చేయడంతో వంశధార, నాగావళి నదుల పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఒడిశాలో వర్షాలకు జిల్లాలోని వానలు తోడయ్యాయి. ఫలితంగా గెడ్డలు సైతం గట్లు దాటి ఉరకలెత్తాయి. వేలాది ఎకరాలు ముంపు గుప్పిట్లో చిక్కుకున్నాయి. వంశధారలో గరిష్ఠంగా 83 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవటంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళ, బుధవారాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు ప్రజలకు కంటివిూది కునుకు లేకుండా చేస్తున్నాయి. మరో వైపు మళ్లింపు కాలువ నుంచి జలాశయంలోకి
నీటి ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా వంశధార, నాగావళి నదులలో వరద పోటెత్తింది. కొన్నిచోట్ల గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు చోట్ల ప్రధాన రహదారిపై నీరు ఉద్ధృతిగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఊర్లలోకి నీరు చేరడంతో నదీ తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. –