నివర్ తుఫాన్‌తో 15లక్షల టన్నుల ధాన్యంపై ప్రభావం
రంగుమారి, మొలకెత్తినట్లు అంచనాలు
ధాన్యం కొనడంలో క్షేత్రస్థాయిలో సమస్యలు
అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : ఇటీవలి నివర్ తుఫాన్ రైతులను కోలుకోకుండా చేసింది. వరికోతల
సమయంలో తుపాన్ రావడంతో పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం 15 లక్షల టన్నుల ధాన్యం రంగు మారడమో, మొలకెత్తడమో జరిగిందని తేలింది. దానిలో దాదాపు నాలుగున్నర లక్షల టన్నులు పూర్తిగా పాడైపోయింది. మిగతా పది లక్షల టన్నుల్లో ఎంత మేరకు కొనుగోలు చేయవచ్చన్న అంశం కేంద్రం ఇచ్చే నాణ్యతా ప్రమాణాల నిబంధనల సడలింపుపై ఆధారపడి ఉంటుంది.గతనెల నివర్ తుపాన్‌తో వరికి మరింత నష్టం వాటిల్లింది. ఏడు లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగితే దానిలో నాలుగైదు లక్షల హెక్టార్లు వరి పంటే ఉంది. పంట కోసి పనల విూద ఉన్న, కోతలకు సిద్ధంగా ఉన్న వరి తడిసిపోయి పొలాల్లోని నీళ్లలో వాలిపోవడంతో నష్టం తీవ్రత అధికంగా ఉంది. నివర్ నష్టంపై అధ్యయనానికి వారం రోజుల్లో మరో కేంద్రకమిటీ రాష్ట్రానికి రానుందని సమాచారం. కమిటీల పర్యటనల మాటెలా ఉన్నా గత అనుభవాల రీత్యా ధాన్యం కొనుగోలుపై నిబంధనల సడలింపు చేయాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. రంగు మారిన, మొలకెత్తిన, పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని సైతం సర్కారు కొంటుందనే భరోసా ఇవ్వాల్సి ఉంది. నష్టపోయిన 15 లక్షల టన్నుల్లో ఎందుకూ పనికిరాని ఐదు లక్షల టన్నులు కొనుగోలు చేస్తే, ఆ సరుకును వేలం వేస్తే ఎవ్వరూ కొనరని, సముద్రంలో పారబో యాల్సిందేనని, క్వింటాలుకు రూ.1,300 నష్టం వస్తుందని, రూ.900 కోట్లు వృధా అవుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం ఆ మొత్తాన్నీ పెట్టుకుంటుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు సిఎం, మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇకపోతే నివర్ తుపాన్ వలన దెబ్బతిన్న వరి ధాన్యం మొత్తాన్నీ రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ప్రకటించినప్పటికీ ఆచరణ సాద్యం కావడం లేదు. కనీసం 2-3 శాతం సడలింపులు తీసుకొస్తే రంగు మారిన పది లక్షల టన్నుల్లో 30-40 శాతం కొనగలుగుతామన్నారు. ధాన్యం కొనుగోలు చేసే అంశం విూద కంటే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే ఆలోచన చేస్తే మంచిదని, తక్కువ ఖర్చులో సర్కారు బయట పడొచ్చని, ధాన్యం కొనుగోలు చేసే సమస్య ఉండదని కొందరు అధికారులు వివరించారు. సమస్యలపై తర్వాత ఆలోచిద్దాం ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు అసెంబ్లీలో, బయటా ప్రకటన చేసినట్లు సమాచారం.