నిస్సహాయులపై దాడులకు ఇస్లాంలో చోటు లేదు

పాక్‌లో హిందువులపై దాడులు అమానవీయం
సైనికులను కిరాతకంగా హత్య చేస్తారా?
పాక్‌ ప్రధానికి స్వాగతం పలికేందుకు ససేమిరా అన్న అజ్మీర్‌ దర్గా చీఫ్‌ అబేదిన్‌
ఆందోళన మధ్య దర్గాను సందర్శించిన పర్వేజ్‌ అశ్రఫ్‌
అజ్మీర్‌,మార్చి 9 (జనంసాక్షి) :
‘నిస్సహాయులు, అల్పసంఖ్యాకులపై దాడులకు ఇస్లాంలో చోటు లేదు. అలా చేసేవారిని అల్లాహ్‌ క్షమించడు. పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై అక్కడి పాలకులు నిత్యం దాడులకు పాల్పడుతున్నారు. ఇది అన్యాయం. అలాంటి వారికి పరిపాలించే అర్హత లేదు. సీమాంతర రేఖ వద్ద కాపలా ఉన్న సైనికులను పాకిస్థాన్‌ అత్యంత క్రూరంగా హత్య చేసింది. వారి తలలు నరికి చంపింది. అలాంటి వ్యక్తి దర్గాకు వచ్చి ప్రార్థనలు జరిపినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతం పలుకబోను’ అంటూ ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గా ఆధ్యాత్మిక గురువు జైనుల్‌ అబేదిన్‌ అలీఖాన్‌ అన్నారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినొద్దీన్‌ షరీఫ్‌ దర్గాను సందర్శించేందుకు పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి పర్వేజ్‌ అశ్రాఫ్‌ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ ద్వారా శనివారం ఆయన జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ స్వాగతం పలికారు. ఆయన పర్యటనను అజ్మీర్‌ దర్గా కమిటీ వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల మధ్య ఆయన దర్గాను సందర్శించుకొని పాకిస్థాన్‌ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా దర్గా చీఫ్‌ అబేదిన్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ, పాకిస్థాన్‌ ఇస్లాం ఆచారాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతోందని, మహ్మద్‌ ప్రవక్త బోధనలకు వ్యతిరేకంగా అక్కడి పాలకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని అల్లా క్షమించబోరని స్పష్టం చేశారు.