నీటి తొట్టెల నిర్వహణలో నిర్లక్ష్యం 

తాగునీటి కోసం మూగజీవాలకు తప్పని తిప్పలు
ఆదిలాబాద్‌,మే18(జ‌నంసాక్షి): ఈసారి ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో మూగజీవాలు
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టెలకు నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లి దాహంతో తొట్ల వద్దకు వస్తున్న పశువులు ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నాయి.  జిల్లావ్యాప్తంగా ఉపాధిహావిూ పథకం ద్వారా తొట్టెల నిర్మాణాలు చేపట్టారు. వీటిని సకాలంలో నాణ్యతతో నిర్మించి ఉంటే ఈ దుస్తితి వచ్చేది కాదు. తొట్టెలను వినియోగంలోకి తేవాల్సిన పశుసంవర్ధశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీశాఖ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీటికి బోరుఏర్పాటు, విద్యుత్‌ కనెక్షన్‌ కల్పించడంవైపు దృష్టి సారించడంలేదు. నోరులేని మూగజీవులను గ్రామ ప్రజాప్రతినిధులన్నా పట్టించుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.మరోవైపు పశువుల దాహం తీర్చడానికి నిర్మించిన నీటి తొట్టెల్లో అవినీతి చోటు చేసుకుంది. అవసరంలేని ప్రదేశాలు, నీటి జాడలేని స్థలాల్లో నాసిరకం నిర్మాణాల కారణంగా అవి నిరుపయోగంగా మారాయి. బూగర్భజలాలు అడుగుంటి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు మైళ్ల దూరం నడుస్తున్నారు. అలాంటిది మూగజీవాల పరిస్థితి చెప్పనవసరం లేదు. వీటి దాహార్తి తీర్చేందుకు గత ప్రభుత్వం గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించింది. ఈ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు అప్పగించింది. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్లు ఈ నిధులతో తమ కడుపులు నింపుకున్నారే తప్ప మూగజీవాల దాహాన్ని తీర్చిన పాపన పోలేదు.

తాజావార్తలు