నీడలా 1984 అల్లర్లకేసు


జగదీశ్‌ టైట్లర్‌పై పునర్విచారణ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌ను 1984 సిక్కుల ఊచకోత కేసు నీడలా వెంటాడుతోంది. ఆయనపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు తిరగతోడాలని బుధవారం ఢిల్లీ కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో ఆయనకు సీబీఐ కోర్టు ఇచ్చిన క్లీన్‌చీట్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసును మూసేస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను కోర్టు సమ్మతించడాన్ని  అదనపు సెషన్స్‌ జడ్జి  అనురాధ శుక్లా భరద్వాజ్‌ తప్పుబట్టారు. అప్పటి ఘటనకు సంబంధించిన సాక్షుల వద్ద సమాచారం

ఉందని, వారిని ప్రశ్నించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. టైట్లర్‌కు సీబీఐ క్లీన్‌చీట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ అల్లర్ల బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పిటిషన్‌పై న్యాయస్థానం కొన్ని నెలల పాటు సుదీర్ఘ విచారణ జరిపింది. ‘టైట్లర్‌ డ్రైవర్‌ను విచారించేందుకు సమయం ఉంది. కానీ ఘటన జరిగిన చోట ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారించేందుకు మాత్రం సమయం దొరకలేదు’ అని బాధితుల తరపు న్యాయవాది పూల్కా ప్రశ్నించారు. 1984, నవంబర్‌ 1న ఉత్తర ఢిల్లీలో ముగ్గురు హత్యకు గురైన గురుద్వారా పుల్బన్‌గాష్‌ ప్రాంతంలో ఆ సమయంలో టైట్లర్‌ లేరని తేలిందని, కేసును మూసివేయాలని సీబీఐ కోరింది. ఆ సమయంలో ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నివాసం తీన్‌మూర్తి భవన్‌లో ఉన్నారని.. ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపామని సీబీఐ తెలిపింది. ముగ్గురి హత్య కేసులో 2009లో సీబీఐ టైట్లర్‌ను నిర్దోషిగా పేర్కొంది. 2010లో మెజిస్ట్రేట్‌ కోర్టు దాన్ని అంగీకరించింది. అయితే, ఘటనాస్థలంలో తాము టైట్లర్‌ను చూశామని పలవురు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు.