నీ అబద్ధాలకు మేం సమాధానం చెప్పనవసరం లేదుమా సభలకు అనుమతులివ్వరు
రెచ్చగొట్టే సభలకు ఎలా అనుమతిచ్చారు : కోదండరామ్
ఉద్యోగాలు తీయమని ఉత్తరాలు రాస్తే
మీరెట్ల జర్నలిస్టు సంఘమైతరు : ‘అల్లం’ సూటి ప్రశ్న
హైదరాబాద్, ఏప్రిల్ 18 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించి నీవు చెప్పిన అబద్ధాలకు మేం సమధానం చెప్పాల్సిన అవసరం లేదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను అవమానించేలా ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమన్నారు. తెలంగాణ ఉద్యమం త్యాగాల పునాదులపై నిర్మించిందని, సమైకాంధ్ర పేరుతో ఏర్పడిన కృత్రిమ ఉద్యమం పిడికెడు మంది పెట్టుబడిదారుల సృష్టి అని అభివర్ణించారు. తెలంగాణ ప్రజల పక్షాన, వారి ఆకాంక్షను వ్యక్తం చేసేందుకు తాము సమావేశలు, సభలకు అనుమతి అడిగితే నిరాకరించే ప్రభుత్వం, పోలీసులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు మాత్రం ఎలా అనుమతి మిగతా 2లోఇస్తారని ప్రశ్నించారు. మేధావిగా చెప్పుకునే పరకాల ప్రభాకర్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా నిర్మాణాత్మకమైన సలహాలివ్వాలే తప్ప ప్రజలను రెచ్చగొట్టడం తగదన్నారు. మేధావుల పేరుతో అబద్ధాలను అచ్చువేసి ప్రజల్లో విషబీజాలు నాటాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర సర్కారు ఇచ్చిన అండతోనే ఇలాంటి కుహనా మేధావులు పేట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు శాంతి సహనంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అభూతకల్పనలు సృష్టించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. పరకాల ప్రభాకర్ అచ్చేసిన 101 అబద్ధాలకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పుస్తకావిష్కరణ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు క్రాంతి కిరణ్‌ను ఆయన పరామర్శించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ, ఆందోళనకు దిగిన జర్నలిస్టుల ఉద్యోగాలకు తీయమని ఉత్తరాలు రాస్తే మీరెట్ల జర్నలిస్టు సంఘమైతరని ఏపీయూడబ్ల్యూజేను ప్రశ్నించారు. భూర్జువా మనస్తత్వం పేరుకుపోయిన జర్నలిస్టు సంఘం అసలు వివాదాస్పద పుస్తక ఆవిష్కరణకు అనుమతి ఇవ్వడమే తప్పన్నారు. సీమాంధ్ర మీడియా, పెట్టుబడిదారులు చేస్తున్న గోబెల్స్ ప్రచారం వల్లే తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టులకు ఏదైనా అన్యాయం జరిగితే టీజేఎఫ్ చూస్తూ ఊరుకోదని, తాము తల్చుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.