నూతన ఎమ్మెల్సీల ప్రమాణం

5

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణలో ఇఠీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నేతలు ప్రమాణస్వీకారం చేశారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి గెలిచిన రామచంద్రరావులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మిగితా ఎమ్మెల్సీలు వారికి అభినందనలు తెలిపారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన రాజేశ్వర్‌ రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ వద్ద ఉన్న  అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ¬ం మంత్రి నాయినీ నర్సింహారెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాజేశ్వర్‌రెడ్డి శాసన మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరిస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. తనను గెలిపించిన పట్టభద్రులందరికీ పల్లా కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటింగ్‌ శాతం పెరిగిందని గుర్తు చేశారు.

మరోవైపు ఏపీ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి సమక్షంలో నూతన ఎమ్మెల్సీలు కూడా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, రామకృష్ణ, వి.వి.చైదరి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధప్రదేశ్‌ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో వీరు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనారు. సభ్యులతో  సోమవారం ఛైర్మన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, టీడీపీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి సోమవారం ఉదయం సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరూ సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి సమక్షంలో సభ్యులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ శాసనమండలి సభ్యునిగా ఎ.రామచంద్రరావు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సమక్షంలో ప్రమాణం చేశారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించారని ఆపార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆయన సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్‌కు రుణపడి ఉన్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను టీడీపీ విస్మరించిదన్నారు. శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెల్టా రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని సుభాష్‌ చంద్రబాస్‌ అన్నారు. పట్టిసీమపై అన్ని వేదికల్లోనూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్‌ జగన్‌తో  పాటు పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌  ధన్యవాదాలు తెలిపారు. ఆంధప్రదేశ్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా శాసనమండలి వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సోమవారం కొత్తగా ఎన్నికైన వైఎస్‌ఆర్‌ సీపీ, ఎమ్మెల్సీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌ సీపీ, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అభిమానుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.