నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌

కపిల్‌ సిబల్‌
న్యూ ఢిల్లీ, మే 25 (జనంసాక్షి) :
నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌ పెట్టవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సబిల్‌ తెలిపారు. శనివారం న్యూ ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఐపీఎల్‌-6నే కాకుండా యావత్‌ దేశాన్ని కుదిపేసిందన్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌లాంటి కుంభకోణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత న్యాయ విధానం తగిన విధంగా లేదన్నారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన నూతన న్యాయ సూత్రాలను సిద్ధం చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. క్రీడా మంత్రిత్వశాఖతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నూతన విధానం అందుబాటులోకి వస్తే ఎలాంటి బెట్టింగ్‌లకు ఆస్కారం ఉండదని, ఎంతటి వారినైనా పట్టుకుని కఠినంగా శిక్షించవచ్చని తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెడుతామని చెప్పారు. ఫిక్సింగ్‌ల చట్టం కేంద్ర పరిధిలోనే ఉంటుందన్నారు.