నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గ ఆమోదం

1

సాగర్‌ ప్రక్షాళన ప్రక్రియకు ఆమోదం

తెలంగాణ రూరల్‌ రోడ్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం

మహిళా భద్రతా బిల్లుకు కేబినేట్‌ ఆమోదం

కళాకారుల కోసం సాంస్కృతిక సారథి

వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ నవంబర్‌ 23 (జనంసాక్షి) : నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన ప్రక్రియను తక్షణమే చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణలో రూరల్‌ రోడ్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళా భద్రతా బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినేట్‌ కళాకారుల కోసం సాంస్కృతిక సారథిని ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అంగీకరించింది. ఆదివారం సాయంత్రం సచివాలయంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, ఆసరా పథకం, సాంస్కృతిక వారధి పతకం, నూతన పారిశ్రామిక విధానం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రివర్గ సభ్యులందరు హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో మంత్రివర్గం కొత్త చట్టాల రూపకల్పనతోపాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. కేబినేట్‌ నిర్ణయాలు ఇవి. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఇందు కోసం రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఆమోద ముద్ర పడింది. నూతన ఇసుక పాలసీ తీసుకు రావాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇందుకోసం సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించింది. రైతులకు నెడ్‌క్యాప్‌ ద్వారా పంపుసెట్ల పంపిణీ చేయాలని తీర్మానించింది. ఇందు కోసం టెండర్లు పిలవాలని నిర్ణయం జరిగింది. వాటర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు ఆమోదం ముద్ర పడింది. తెలంగాణ రూరల్‌ రోడ్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రోడ్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు మంత్రివర్గం ఆమోదించింది. అలాగే కళాకారుల సంక్షేమం కోసం, వారిని ఆదుకునేందుకు సాంస్కృతిక సారథి ఏర్పాటుకు నిశ్చయించింది. మహిళా భద్రతా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అమలుచేస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని అన్నివర్గాలకు న్యాయంచేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సీఎం ఆచరణలో పలు చర్యలు తీసుకుంటున్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో పేదలకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్‌ బడుగు, బలహీనవర్గాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంత్రివర్గ నిర్ణయాలో రాష్ట్రంలో ఆయా సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.