నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
వరంగల్: కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ నగరంలోని ప్రధాని కూడలులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య దగ్గరుండి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్‌లోని ఖిలా వరంగల్, హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. మూడు వేదికల్లో కాకతీయుల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా 228 ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణవాదులు నిరకసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తు అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.