నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

ఎగ్జిట్‌పోల్స్‌తో కాంగ్రెస్‌లో హుషారు.. బీజేపీ బేజార్‌
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
బెంగళూరు, మే 7 (జనంసాక్షి) : కర్ణాటక విధాన సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం జరగనుంది. మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు దాదాపు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఫలితాల లెక్కింపు త్వరగానే పూర్తయ్యే అవకశాలు ఉన్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేసింది. మద్యం దుకాణాలను మూస ివేయించారు. ఈ నెల ఐదున జరిగిన పోలింగ్‌ తరవాత 8న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 224 స్థానాలకు గాను 223 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే గతంతో పోలిస్తే 7శాతం పోలింగ్‌ శాతం పెరగడమే గాకుండా మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ తేడా ఎవరికి అనుకూలం కాబోతున్నదనేది తేలనుంది. అధికార బిజెపికి ఈ సారీ ఎదురుదెబ్బతగలడం ఖాయమని తెలుస్తోంది. తొలిసారి దక్షిణాదిలో పీఠమెక్కిన కమలం దానిని నిలబెట్టుకోవడంలో విఫలమ య్యిందన్న సూచనలు స్పస్టంగా గోచరిస్తున్నాయి. కేంద్రంలో ఎన్ని కుంభకోణాల్లో మునిగితేలుతున్నా కర్నాటకలో మాత్రం హస్తం హవా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సర్వేల ప్రకారం   కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగాఉన్నాయి. అయితే, ముందుగా ఊహించనట్లుగా భారీ ఆధిక్యం సాధించటం కష్టమేనని, స్వల్ప ఆధిక్యతతో అధికారం తథ్యమని తెలుస్తోంది. ఆ పార్టీ 110 నుంచి 116 స్థానాల్లో గెలుపొందవచ్చని పోలింగ్‌ అనంతర విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అధికార బిజెపి  50 స్థానాలకు పరిమితం కావచ్చని, విపక్ష జేడీ(ఎస్‌)కూ అదే స్థాయిలో స్థానాలు దక్కవచ్చని పలు ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 114 స్థానాలతో బొటాబొటి ఆధిక్యత లభిస్తుందని అంచనా.  అయితే వంద ఫిగర్‌ దాటినా అధికారం మాదే అన్న ధీమాలో కాంగ్రెస్‌ ఉంది. మొత్తం 224 సభ్యులున్న కర్ణాటక విధాన సభకుగాను 223 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. అధికార భాజపాలో చీలికలు, అవినీతి ఆరోపణలు తదితరాల నేపథ్యంలో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందని గత వారం రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, ఆదివారం పోలింగ్‌ అనంతర సర్వేల్లో పరిస్థితి కొంత మారినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారాన్ని కైవశం చేసుకోవటం ఖాయమేనని తెలుస్తున్నా.. అందుకు అవసరమైన పూర్తి మెజారిటీ లభించకపోవచ్చని సమాచారం. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, అంతర్గత కుమ్ములాటలు ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి, కర్నాటక జనతా పార్టీల మధ్య మధ్య ఓట్ల చీలిక కాంగ్రెస్‌కు కలిసి వచ్చేలా ఉంది.  మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలోని కజపా 10స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సిఎం ఎవరన్నది జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేంద్రమంత్రి మల్లిఖార్జన ఖర్గే,ఎస్‌ఎం కృష్ణ తదితరులు పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ ఎవరిని నేతగా ఎన్నుకంటుందన్నది అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఫలితాలకు ముందే రాష్ట్రకాంగ్రెస్‌లో విజయోత్సాహం కనిపిస్తోంది. బిజెపిలో అంతర్గత కలహాలు, సిఎంల మార్పు, యెడ్యూరప్ప పార్టీ తదితర కారణాల వల్ల బిజెపి తీను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నది. గుజరాత్‌లో లాగా పటిష్ట నిర్మాణం లేకపోవడం, నేతల్లో నిజాయితీ లోపించడం బిజెపికి మైనస్‌గా భావించవచ్చు. ఇకవిధానసభ ఎన్నికల్లో పోలింగ్‌ 71.29 శాతంగా నమోదైంది. గత విధానసభ ఎన్నికల్లో ఇది 64.78 శాతమే. గత 35 ఏళ్లలో ఇంతటి భారీ పోలింగ్‌ జరగలేదని ఎన్నికల అధికారి అనిల్‌కుమార్‌ ఝా తెలిపారు. బెంగళూరు నగరంలో సాధారణం కంటే పది శాతం పోలింగ్‌ ఎక్కువగా నమోదైంది. 2008లో ఆ శాతం 49.87 కాగా ఈ సారి 57.38. చిక్కబళ్లాపుర జిల్లాలో అత్యధికంగా 83.5 శాతం దాఖలైంది. ఓటర్లల్లో 72.25 శాతం మంది పురుషులు, 70.28 మంది మహిళలు ఓట్లేశారు. ఉడుపి, బీదర్‌ జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓట్లేశారు.  రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచాలని ఎన్నికల సంఘం చేసిన కసరత్తు కారణంగా మెరుగైన పోలింగ్‌ నమోదయ్యింది. బెంగళూరు మినహాయించి రాష్ట్రమంతటా ఓటు హక్కు వినియోగ ప్రచారానికి ఐదు కోట్లు ఖర్చు చేశారు. 18-21 ఏళ్ల లోపు ఓటర్లు యాబది లక్షలమంది ఓటేయడం వల్లే పోలింగ్‌ శాతం పెరిగిందని అధికారులు  విశ్లేషించారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వేతర సంస్థల కృషి ఫలితంగా బెంగుళూరు నగర పోలింగ్‌ శాతం మెరుగు పడింది. 2008 ఎన్నికల్లో 47.30 శాతమే నగర పోలింగ్‌. ఈసారి వృద్ధి చెందింది. ‘ఓటు హక్కు పట్ల నగరవాసుల్లో, యువతలో అవగాహన కల్పించడానికి చేసిన యత్నాలు కూడా ఫలించలేదు.  విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఓటేయాలనే లక్ష్యం పాక్షికంగానే నెరవేరింది’ అన్నారు. నగర ఓటర్లను ఆదివారం బద్ధకం ఆవరించడంతో పోలింగ్‌ కేంద్రాలకు ఇళ్లు వదిలిరాలేదు. మరికొందరు స్వస్థలాలకు వెళ్లిపోవడం, ఎండలు మండడం లాంటి కారణాల వల్ల కూడా ఓటింగ్‌ శాతం పెరగలేదు.