నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సదస్సు


వలస పక్షులపైనే ఆశలు
ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఫలిస్తుందా? వికటిస్తుందా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితి 12వ వార్షికోత్సవ సదస్సు శనివారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో జరగ నుంది. ఇందుకు సంబం ధించిన ఏర్పాట్లన్నీ పూర్త య్యాయి. వలస పక్షులపై టీఆర్‌ఎస్‌ పెట్టు కున్న ఆశలు ఫలిస్తాయా? లేదా అన్నది తేలిపోనుంది. 2014 ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే, 15 వరకు ఎంపీ సీట్లు గెలవాలని ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వివిధ పార్టీల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు వల విసిరారు. వారికి సన్నిహితులతో మాట్లాడి తమ పార్టీలో కల్పించబోయే స్థానంపై వారితో రాయబేరాలు నెరిపారు. ఈక్రమంలో పార్టీ ఆవిర్భావ సదస్సు కీలకం కానుంది. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 30 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తిరిగి కె.చంద్రశేఖరరావు పేరును ప్రకటించడం లాంఛనమే. అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసే గడువు గురువారమే ముగిసింది. కెసిఆర్‌ తరపున అయిదు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు కాగా మరెవరూ నామినేషన్‌ వేసేందుకు సాహసించలేదు. దీంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు నాయిని నర్సింహా రెడ్డి కెసిఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ప్రకటించారు. అయితే ఎన్నికల ముందు జరుగుతున్న  ఈ వార్షికోత్సవ సదస్సుకు          మిగతా 2లో ప్రత్యేకత ఉంది. ఈ సభ ద్వారా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ప్రతినిధులు  టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కెసిఆర్‌ కూడా వార్షికోత్సవ సభకు ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు పార్టీలో చేరితేనే టిక్కెట్లకు హామీ ఇస్తానని ప్రకటించారు. మే 15వ తేదీన పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నందున ఆ తర్వాత చేరి ప్రయోజనం ఉండబోదని, టిక్కెట్‌పై మాత్రం హామీ ఉండబోదని తేల్చేశారు. అనంతరం పార్టీలోకి వస్తే ఎప్పటి నుండో పార్టీలో పనిచేస్తున్న నాయకుల నుండి వత్తిడి కూడా పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని గడువులోగా చేరాలని కెసిఆర్‌ షరతు విధించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మందా జగన్నాధం, వివేక్‌,  రాజయ్య, తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, రత్నం, దేవయ్య, హనుమంతు, తదితరులు కూడా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ గురువారంనాడు కెసిఆర్‌ సమక్షంలో కరీంనగర్‌లో కదనభేరి నిర్వహించి పార్టీలో చేరారు. మిగిలిన వారు కెసిఆర్‌ డెడ్‌లైన్‌ను ఖాతరు చేయనట్టుగా కనిపిస్తోంది.  ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు శనివారం జరగనున్న ఆవిర్భావ సదస్సులో ఎంతమంది చేరుతారనేది చూడాల్సిందే. కెసిఆర్‌ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్న అంశం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.