నేడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ
` నేటినుంచి రేషన్ కార్డులు పంపిణీ
` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు
హైదరాబాద్(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్ కార్డులను నిరంతరం అందించే ప్రక్రియ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగే సభా కార్యక్రమంలో పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి 3,58,187 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో అదనంగా 15,53,074 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనున్నది. మొదటి దశలో సిఎం రేవంత్ రెడ్డి 2,03,156 కొత్త కార్డులు మంజూరు కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. తుంగతుర్తి సభలో కొత్త రేషన్ కార్డుల జారీతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89,95,282 నుంచి 95,56,625 కు చేరుకుంటుంది. లబ్ధిదారుల సంఖ్య 2,81,47,565 మంది నుంచి 3,09,30,911 మంది వరకు పెరుగుతుంది.
వెబ్ సైట్ ద్వారా వివరాలు
ఇప్పటి వరకు మంజూరైన కొత్త కార్డులతో పాటు కుటుంబ సభ్యుల జోడిరపు వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు నెంబర్ లేదా మీసేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.